Indian origin: చెకప్ పేరుతో మహిళా రోగులపై లైంగిక అకృత్యాలు.. భారత వైద్యుడిపై అమెరికాలో కేసు
- వృద్ధుల సంరక్షణ కేంద్రంలో ఫిజీషియన్ అనుచిత చర్యలు
- ఏడాది కాలంలో నలుగురు మహిళా రోగులపై లైంగిక చర్యలు
- రోగుల రాజ్యాంగ హక్కులను హరించారన్న న్యాయ విభాగం
బాధ్యత గల వృత్తిలో ఉన్న ఓ వైద్యుడు అసభ్యకరమైన పనులు చేస్తున్న విషయం వెలుగు చూసింది. అమెరికాలోని జార్జియా రాష్ట్రంలో 68 ఏళ్ల భారతీయ ఫిజీషియన్ రాజేష్ మోతీ భాయ్ పటేల్ తన వద్దకు వచ్చిన వృద్ధ మహిళా రోగులపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నట్టు కేసు నమోదైంది. 12 నెలల కాల వ్యవధిలో తన వద్దకు చెకప్ కోసం వచ్చిన నలుగురు రోగులపై ఆయన లైంగిక చర్యలకు పాల్పడినట్టు అక్కడి న్యాయ విభాగం పేర్కొంది.
రాజేష్ మోతీ భాయ్ పటేల్ జార్జియాలోని వెటరన్ అఫైర్స్ మెడికల్ సెంటర్ లో ఫిజీషియన్ గా పనిచేస్తున్నారు. చట్టం ముసుగులో అవాంఛిత లైంగిక చర్యలకు పాల్పడడం ద్వారా రోగుల రాజ్యాంగ హక్కులకు భంగం కలిగించినట్టు అమెరికా న్యాయ విభాగం ప్రకటన విడుదల చేసింది. తన సంరక్షణలో ఉంటే ఎలాంటి హాని తలపెట్టనన్న హామీతో 2019-2020 మధ్య మహిళా రోగుల పట్ల లైంగిక వేధింపులకు పాల్పడినట్టు పేర్కొంది. ఈ కేసును వృద్ధుల వ్యవహారాల విభాగం దర్యాప్తు చేయనుంది.