Kerala stories: మధ్యప్రదేశ్ బాటలో యూపీ సర్కారు.. ‘కేరళ స్టోరీస్’ కు టాక్స్ ఫ్రీ
- ట్విట్టర్ లో వెల్లడించిన సీఎం యోగి ఆదిత్యనాథ్
- బెంగాల్ లో ఆ సినిమా ప్రదర్శనపై బ్యాన్ విధించిన దీదీ
- సినిమాపై విమర్శలు గుప్పించిన కేరళ ముఖ్యమంత్రి
‘ది కేరళ స్టోరీస్’ సినిమాకు ఉత్తరప్రదేశ్ లో పన్ను మినహాయింపు కల్పిస్తామంటూ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మంగళవారం ప్రకటించారు. బెంగాల్ లో ఈ సినిమా ప్రదర్శనను బ్యాన్ చేస్తున్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ మరుసటి రోజే యోగి సర్కారు ఈ టాక్స్ ఫ్రీ ప్రకటన చేశారు. ఇప్పటికే ఈ సినిమాకు మధ్యప్రదేశ్ ప్రభుత్వం పన్ను మినహాయింపును ఇచ్చింది. కాగా, కేరళ ప్రభుత్వం మాత్రం ఈ సినిమాపై మండిపడుతోంది. అవాస్తవాలు ప్రచారం చేస్తూ సమాజంలో శాంతిభద్రతలకు భంగం కలిగించేలా ఉందని ఈ సినిమాపై కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
కేరళకు చెందిన ముగ్గురు యువతులు మతం మార్చుకుని ఐసిస్ లో చేరడం, దాని వెనకున్న పరిస్థితులకు సంబంధించిన కథే ఈ కేరళ స్టోరీస్ సినిమా. ఈ సినిమా వివాదాస్పదంగా మారిన విషయం తెలిసిందే! సినిమాను బ్యాన్ చేయాలంటూ ఆందోళనలు కూడా జరుగుతున్నాయి. తమిళనాడులో థియేటర్ల ముందు పలు సంఘాలు నిరసన ప్రదర్శన చేయడంతో యాజమాన్యాలు ఈ సినిమా ప్రదర్శనను ఆపేశాయి. అయితే, కేరళ స్టోరీస్ సినిమాకు అన్ని రాష్ట్రాలు పన్ను మినహాయింపు కల్పించాలంటూ బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ ఈ సినిమాను విద్యార్థులతో కలిసి చూశారు.