Andhra Pradesh: ఆ ఎమ్మెల్యేను గెలిపించి తప్పుచేశామంటూ చెప్పుతో కొట్టుకున్న కౌలు రైతు
- ఎన్టీఆర్ జిల్లాలో ‘ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి’ కార్యక్రమం
- దామలూరు మండలంలో టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పర్యటన
- అకాల వర్షాలతో తడిసిపోయిన వడ్లను పరిశీలించిన దేవినేని
- దేవినేనితో తమ సమస్యలు చెప్పుకున్న స్థానిక రైతులు
- వసంత కృష్ణ ప్రసాద్‌ను ఎమ్మెల్యేగా గెలిపించి తప్పుచేశామంటూ చెప్పుతో కొట్టుకున్న ఓ కౌలు రైతు
మైలవరం ఎమ్మెల్యే వనంత కృష్ణ ప్రసాద్‌పై తీవ్ర అసహనం వ్యక్తం చేశాడో కౌలు రైతు. ఆయనను ఎమ్మెల్యేగా గెలిపించి తప్పు చేశామంటూ తనని తానే చెప్పుతో కొట్టుకున్నాడు. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం గ్రామీణ మండలం దామలూరులో సోమవారం చోటుచేసుకుందీ ఘటన. ‘ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి’ కార్యక్రమంలో భాగంగా టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు దామలూరులో పార్టీ నాయకులతో కలిసి పర్యటించారు. అకాల వర్షాలకు తడిసిపోవడంతో కల్లాల్లో ఆరబెట్టిన మొక్కజొన్న కంకులను పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన వైసీపీ ప్రభుత్వంపై మండిపడ్డారు. నష్టపోయిన కర్షకులను పరామర్శించే తీరిక మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్‌కు లేదా? అని ప్రశ్నించారు. ఈ క్రమంలోనే షేక్ గాలి సైదా అనే రైతు దేవినేని ఉమాతో తన గోడు వెళ్లబోసుకున్నారు. ‘‘మా మైలవరానికి, మాకు దరిద్రం పట్టి నష్టపోయాం. మా ఎమ్మెల్యే కృష్ణ ప్రసాద్ ఎక్కడ ఏసీలో పడుకున్నాడో మహానుభావుడు. ఆయన ముఖం టీవీలో కూడా చూడలేదు సార్ నేను. ఒక్కరోజైనా వడ్లు, మొక్కజొన్న కొనమని చెప్పాడా..? సార్.. మిమ్మల్ని (దేవినేని ఉమా) ఓడించి తప్పు చేశాం’’ అంటూ తన చెప్పుతో చెంపలపై కొట్టుకున్నారు.