Sonia Gandhi: ‘సార్వభౌమాధికార’ వ్యాఖ్యలు.. సోనియా గాంధీపై ఈసీకి బీజేపీ ఫిర్యాదు

BJP files complaint with poll body against Sonia Gandhis Karnataka sovereignty threat remark

  • దేశ వ్యతిరేక ప్రకటన చేసిన సోనియాపై చర్యలు తీసుకోవాలన్న బీజేపీ
  • ఎఫ్ఐఆర్ న‌మోదు చేసేలా ఆదేశాలివ్వాల‌ని ఈసీకి విజ్ఞప్తి
  • కాంగ్రెస్ మేనిఫెస్టో.. ‘తుక్డే-తుక్డే’ గ్యాంగ్ ఎజెండా అంటూ మండిపాటు

కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీపై బీజేపీ ఫిర్యాదు చేసింది. కర్ణాటకలోని హుబ్బలిలో సోనియా చేసిన వ్యాఖ్యలు ‘విభజన’ స్వభావాన్ని కలిగి ఉన్నాయంటూ ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించింది. దేశ వ్యతిరేక ప్రకటన చేసిన సోనియా గాంధీపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని కోరింది. కాంగ్రెస్ అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసిన ఫొటోను కూడా ఫిర్యాదుకు బీజేపీ జత చేసింది.

సోనియా మాట్లాడిన విష‌యాన్ని రెండు రోజుల కిందట కాంగ్రెస్ పార్టీ ట్వీట్ చేసింది. ‘‘క‌ర్ణాట‌క ప్ర‌తిష్ఠ, సార్వ‌భౌమ‌త్వానికి, స‌మ‌గ్ర‌త‌కు ఎలాంటి ప్ర‌మాదం జ‌ర‌గ‌కుండా కాంగ్రెస్ చూస్తుంది’’ అని సోనియా చెప్పినట్లు పేర్కొంది. 

అయితే కర్ణాటక సార్వభౌమత్వాన్ని కాపాడతామని సోనియా వ్యాఖ్యానించడంపై బీజేపీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. సార్వ‌భౌమ‌త్వం అనే పదాన్ని దేశం కోసం వాడుతామ‌ని, అందుకే సోనియాపై ఎఫ్ఐఆర్ న‌మోదు చేసేలా ఆదేశాలు ఇవ్వాల‌ని ఈసీని బీజేపీ కోరింది. ‘‘స్వార్వభౌమత్వం అంటే స్వతంత్ర దేశమని అర్థం. ఇండియా సార్వభౌమ దేశం. అందులో కర్ణాటక.. గర్వించదగిన భాగం’’ అని తన ఫిర్యాదులో పేర్కొంది.

ఈ రోజు ఎన్నికల కమిషన్‌ను కేంద్ర మంత్రి భూపేందర్ యాదవ్, అనిల్ బలూని, తరుణ్ చుగ్‌లతో కూడిన బీజేపీ నేతల బృందం కలిసింది. తర్వాత మీడియాతో భూపేందర్ యాదవ్ మాట్లాడుతూ.. ‘‘ఆమె (సోనియా గాంధీ) ఉద్దేశపూర్వకంగా సార్వభౌమాధికారం అనే పదాన్ని ఉపయోగించారు. కాంగ్రెస్ మేనిఫెస్టో.. ‘తుక్డే-తుక్డే’ గ్యాంగ్ ఎజెండా. అందుకే వాళ్లు అలాంటి పదాలను ఉపయోగిస్తున్నారు. ఈ దేశ వ్యతిరేక చర్యపై ఈసీ చర్యలు తీసుకుంటుందని మేము ఆశిస్తున్నాం’’ అని అన్నారు.

More Telugu News