China Tourist: హోటల్ గదిలో మంచం కింద మృతదేహం.. చైనా టూరిస్టుకు టిబెట్ లో భయానక అనుభవం

Chinese Tourist Finds Dead Body Under Bed In Tibet Hotel
  • భయంతో మరుసటి రోజే దేశం దాటిన పర్యాటకుడు
  • అంతకుముందు ఆ గదిలో ఉన్న తనను పోలీసులు విచారించారని వెల్లడి
  • పాస్ పోర్ట్, వీసా పరిశీలించి వదిలిపెట్టారన్న చైనా టూరిస్ట్
చైనాకు చెందిన ఓ పర్యాటకుడు టిబెట్ లో తనకు ఎదురైన భయానక అనుభవం గురించి సోషల్ మీడియాలో పంచుకున్నాడు. అంతర్జాతీయ పర్యటనలో భాగంగా టిబెట్ ను చుట్టిరావాలని ఇటీవల ప్లాన్ చేసుకున్నట్లు తెలిపాడు. వీసా దగ్గరి నుంచి హోటల్ బుకింగ్ దాకా అన్నీ సక్రమంగా పూర్తయ్యాయని, షెడ్యూల్ ప్రకారమే తాను టిబెట్ లో అడుగుపెట్టానని చెప్పాడు. ముందుగా రిజర్వ్ చేసుకున్న హోటల్ కు వెళ్లగా.. వాళ్లు ఇచ్చిన గది తనకు ఏమాత్రం నచ్చలేదని చెప్పాడు.

ఆ గదిలోకి అడుగుపెట్టగానే దుర్వాసన వచ్చిందని వివరించాడు. తొలుత ఆ వాసన తన షూలో నుంచి వస్తోందని భావించానని, ఆ తర్వాత గది కిందే ఉన్న బేకరీ నుంచి వస్తోందని అనుకున్నానని తెలిపాడు. వాసన భరించలేక హోటల్ మేనేజర్ తో మాట్లాడి గది మార్పించున్నానని వివరించాడు. ఆపై చుట్టుపక్కల ప్రాంతంలోని టూరిస్టు ప్రదేశాలను చూసేందుకు వెళ్లానని, తిరిగొచ్చేసరికి తన కోసం పోలీసులు ఎదురుచూస్తున్నారని పేర్కొన్నాడు. స్టేషన్ కు తీసుకెళ్లాక తెలిసిందేంటంటే.. తను అంతకుముందు ఉన్న గదిలో మంచం కింద మృతదేహం బయటపడింది. దీంతో హోటల్ సిబ్బంది పోలీసులకు సమాచారం ఇవ్వగా.. తనను స్టేషన్ కు తీసుకెళ్లి విచారించారని చైనా పర్యాటకుడు చెప్పాడు. 

తను ఆ రోజు ఉదయమే రావడంతో ఫ్లైట్ టికెట్లు, వీసా, పాస్ పోర్ట్ లను పరిశీలించి వదిలిపెట్టారని వివరించాడు. ఆ మృతదేహం చాలా రోజులుగా అక్కడే ఉందని తేలడంతో తను ఏ కేసూ లేకుండా బయటపడ్డానని చెప్పుకొచ్చాడు. మంచం కింద డెడ్ బాడీ ఉన్న గదిలో తాను దాదాపు ఓ పూట గడిపానని గుర్తొస్తే ఒళ్లు జలదరిస్తోందని అన్నాడు. ఆ షాక్ నుంచి తాను ఇంకా తేరుకోలేదని, నిద్ర కూడా పట్టడం లేదని వివరించాడు. ఈ సంఘటన తర్వాత మరుసటి రోజు ఉదయాన్నే తాను టిబెట్ నుంచి వచ్చేశానని తెలిపాడు. కాగా, ఈ హత్యకు పాల్పడిన నిందితుడిని అరెస్టు చేసినట్లు టిబెట్ పోలీసులు ప్రకటించారు.
China Tourist
tibet
dead body
hotel room
tibet police

More Telugu News