Corona Virus: భారత్‌లో 2 వేల మార్కు దిగువకు కరోనా కేసులు
- గత 24 గంటల్లో కొత్తగా 1,839 కరోనా కేసులు
- మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 25,178
- దేశవ్యాప్తంగా సగటు రికవరీ రేటు 98.75 శాతం
భారత్‌లో గత కొన్ని రోజులుగా కరోనా కేసుల్లో తగ్గుదల కనిపిస్తోంది. తాజాగా కరోనా రోజువారీ కేసుల సంఖ్య 2 వేల దిగువకు పడిపోయింది. గత 24 గంటల్లో కొత్తగా 1,839 కరోనా కేసులు వెలుగు చూసినట్టు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సోమవారం వెల్లడించింది. మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 25,178కు చేరుకుంది. ప్రస్తుతం దేశంలో రికవరీ రేటు 98.75 శాతంగా ఉన్నట్టు కేంద్రం వెల్లడించింది.
ప్రభుత్వ లెక్కల ప్రకారం.. కరోనా సంక్షోభం మొదలైన నాటి నుంచి ఇప్పటివరకూ మొత్తం కరోనా కేసుల సంఖ్య 4.49 కోట్లు కాగా, 5.31 లక్షల మంది ఈ మహమ్మారికి బలయ్యారు. ఇక కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 4.44 కోట్లుగా ఉంది. ఇప్పటివరకూ దేశంలో 220.66 కోట్ల కరోనా డోసులు పంపిణీ చేశారు.