David Warner: సిరాజ్ బౌలింగ్ గతిని దెబ్బతీయడంలో సక్సెస్ అయ్యాం: వార్నర్
- ఐపీఎల్ లో నిన్న ఢిల్లీ క్యాపిటల్స్, ఆర్సీబీ మధ్య మ్యాచ్
- 7 వికెట్ల తేడాతో నెగ్గిన ఢిల్లీ
- ఢిల్లీ క్యాపిటల్స్ ఆటగాళ్లతో సిరాజ్ వాగ్వాదం
- సిరాజ్ బౌలింగ్ లో లయ కోల్పోయేలా చేశామన్న వార్నర్
- ప్లాన్ విజయవంతమైందని వెల్లడి
గత రాత్రి ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మ్యాచ్ సందర్భంగా ఇరుజట్ల ఆటగాళ్ల మధ్య వాగ్యుద్ధం నడిచిన సంగతి తెలిసిందే.
ఢిల్లీ జట్టు ఛేజింగ్ చేస్తున్న సమయంలో బెంగళూరు బౌలర్ సిరాజ్ కు, ఢిల్లీ ఆటగాళ్లు ఫిల్ సాల్ట్, డేవిడ్ వార్నర్ కు మధ్య వాడీవేడిగా మాటలు నడిచాయి. ఓ దశలో సిరాజ్ వేలు చూపిస్తూ వార్నర్ దిశగా దూసుకెళ్లాడు. అంపైర్ జోక్యంతో ఇరువర్గాలు శాంతించాయి.
దీనిపై మ్యాచ్ అనంతరం వార్నర్ స్పందించాడు. ఈ టోర్నీలో వికెట్లకు సూటిగా బౌలింగ్ చేస్తూ బ్యాట్స్ మెన్ ను బోల్తా కొట్టిస్తున్న సిరాజ్ బౌలింగ్ గతిని దెబ్బతీయాలని భావించామని, అప్పుడు అతడి బౌలింగ్ లో ఈజీగా పరుగులు చేయొచ్చన్నది తమ ప్రణాళిక అని వార్నర్ వెల్లడించాడు.
అనుకున్నట్టుగానే తమ ప్లాన్ అమలు చేశామని, సిరాజ్ లయను కోల్పోయి లైన్ అండ్ లెంగ్త్ గతి తప్పాడని వివరించాడు. తమ ప్లాన్ విజయవంతమైదని వెల్లడించాడు. కాగా, ఆర్సీబీపై ఘన విజయంతో సరైన సమయంలో గాడినపడ్డామని భావిస్తున్నట్టు వార్నర్ తెలిపాడు.