Ooru Peru Bhairavakona: గరుడ పురాణం చుట్టూ తిరిగే ‘ఊరు పేరు భైరవ కోన’... ఉత్కంఠభరితంగా టీజర్!

Sundeep Kishans Ooru Peru Bhairavakona Teaser released

  • సందీప్ కిషన్ హీరోగా ‘ఊరు పేరు భైరవ కోన’ తెరకెక్కిస్తున్న వీఐ ఆనంద్
  • ఆద్యంతం ఆసక్తికరంగా టీజర్
  • అదిరిపోయిన శేఖర్‌ చంద్ర బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌

తొలి నుంచి విభిన్న కథాంశాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నా.. కమర్షియల్‌గా హిట్టు కొట్టలేకపోతున్నాడు సందీప్ కిషన్. ఇటీవల వచ్చిన మైఖేల్ సినిమా కూడా ఫ్లాప్ ను మూటగట్టుకుంది. ఈ నేపథ్యంలో కొత్త జానర్ ను ట్రై చేశాడు. మిస్టరీ, హారర్ కలగలిసిన ‘ఊరు పేరు భైరవ కోన’ సినిమాలో నటిస్తున్నాడు. తాజాగా ఈ చిత్రం టీజర్ విడుదలైంది.

ఈ సినిమా మొత్తం గరుడపురాణం చుట్టూ తిరుగుతుందని టీజర్ ని బట్టి తెలుస్తోంది. ‘శ్రీ కృష్ణ దేవరాయ కాలంలో చెలామణిలో ఉన్న గరుడపురాణానికి, ఇప్పటి గరుడపురాణానికి.. నాలుగు పేజీలు తగ్గాయి..’ అనే డైలాగ్ తో మొదలయ్యే టీజర్..  ‘ఆ నాలుగు పేజీలే భైరవ కోన’ అనే డైలాగ్ తో ముగుస్తుంది. ‘ఈ ఊరిలోకి రావడమే కానీ.. బయటకు పోవడం ఉండదు’ అనే డైలాగ్ ఉత్కంఠను రేకెత్తిస్తోంది.

మరీ ఆ మాయమైన పేజీల్లో ఏం ఉన్నాయి? అసలు భైరవకొనలో ఏం జరుగుతోంది? నాలుగు పేజీలు భైరవకోనగా మారడమేంటి? అనే అంశాలు సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి. శేఖర్‌ చంద్ర బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌ వేరే లెవల్లో ఉంది. రాజ్‌ తోట సినిమాటోగ్రఫీ హైలైట్‌. నైట్‌ షాట్స్ అద్భుతంగా తీశారని టీజర్ చూస్తే అర్థమవుతుంది..

‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’, ‘ఒక్క క్షణం’ తదితర చిత్రాలను తెరకెక్కించిన వీఐ ఆనంద్‌ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్‌ దశలో ఉంది. సందీప్‌కు జోడీగా కావ్యా థాపర్‌, వర్ష బొల్లమ్మ నటిస్తున్నారు. ఏకే ఎంటర్‌టైన్ మెంట్స్‌, హాస్య మూవీస్‌ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి.

More Telugu News