Virat Kohli: చిన్ననాటి కోచ్ ను గౌరవించిన కోహ్లీ
- ఐపీఎల్ మ్యాచ్ కోసం ఢిల్లీ వచ్చిన కోహ్లీ
- కోహ్లీతో మాట్లాడేందుకు స్టేడియంలో అడుగుపెట్టిన రాజ్ కుమార్ శర్మ
- గురువుకు వినయవిధేయతలతో పాదాభివందనం చేసిన కోహ్లీ
గురు బ్రహ్మ... గురు విష్ణు... గురు దేవో మహేశ్వరః... గురు సాక్షాత్ పరబ్రహ్మ... తస్మై శ్రీ గురవే నమః అని భారతీయ సమాజంలో గురువును దైవ స్వరూపంతో పోల్చుతారు. గురువును ఎప్పుడూ గౌరవించాలని పై వాక్యాలు చెబుతుంటాయి. ఏ రంగంలో అయినా వ్యక్తులకు పునాది వేసేది గురువులే. స్టార్ క్రికెటర్లు కూడా అందుకు మినహాయింపు కాదు.
కాగా, టీమిండియా బ్యాటింగ్ దిగ్గజం విరాట్ కోహ్లీ తన చిన్ననాటి కోచ్ ను గౌరవించిన తీరు అందరినీ ఆకట్టుకుంటోంది. ఐపీఎల్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు కోహ్లీ ప్రాతినిధ్యం వహిస్తుండడం తెలిసిందే.
ఢిల్లీ క్యాపిటల్స్ తో మ్యాచ్ ఆడేందుకు కోహ్లీ తన సొంతగడ్డ ఢిల్లీ వచ్చాడు. ఈ సందర్భంగా కోహ్లీ చిన్ననాటి కోచ్ రాజ్ కుమార్ శర్మ తన శిష్యుడ్ని చూసేందుకు ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియానికి వచ్చారు. తన క్రికెట్ లో ఓనమాలు నేర్పిన గురువును చూడగానే కోహ్లీ చేస్తున్న ప్రాక్టీసును ఆపేశాడు. నేరుగా రాజ్ కుమార్ శర్మ వద్దకు చేరుకుని వినయంగా పాదాలకు నమస్కరించాడు. కోహ్లీ విధేయత పట్ల ఎంతో సంతోషించిన ఆయన శిష్యుడి వీపు తట్టి దీవెనలు అందించాడు. అనంతరం ఇద్దరూ కాసేపు ముచ్చటించుకున్నారు.