Ashok Babu: సీఎం జగన్ కు ఉద్యోగులు, పెన్షనర్లే తగిన సమాధానం చెబుతారు: అశోక్ బాబు

Ashok Babu fires on CM Jagan

  • ఉద్యోగులు, పెన్షనర్లను ఇబ్బంది పెడుతున్నారన్న అశోక్ బాబు 
  • సకాలంలో జీతాలు, పెన్షన్లు ఇవ్వడంలేదని ఆరోపణ
  • అప్పులు పుడితే తప్ప జీతాలు ఇవ్వలేని అసమర్థ ప్రభుత్వం అంటూ ఆగ్రహం

ఉద్యోగులు, పెన్షనర్లకు సకాలంలో జీతాలు, పెన్షన్లు ఇవ్వకుండా వేధిస్తున్న ముఖ్యమంత్రి... భవిష్యత్ లో వారి నిర్ణయాల తాలూకా ఫలితాల్ని కచ్చితంగా అనుభవిస్తాడని టీడీపీ నేత పరుచూరి అశోక్ బాబు స్పష్టం చేశారు. 

అప్పులు పుడితే తప్ప జీతాలు ఇవ్వలేని అసమర్థ ప్రభుత్వ విధానాలతో ప్రజలతోపాటు, ఉద్యోగులు పెన్షనర్లు కూడా రోడ్డున పడాల్సిన దుస్థితి ఏర్పడిందని విమర్శించారు. పెన్షన్ దారులకు సకాలంలో జీతాలు ఇవ్వకపోతే, వయసు పైబడిన వారు ఎలా బతుకుతారనే ఆలోచన ప్రభుత్వానికి లేకపోవడం బాధాకరం అని ఆవేదన వ్యక్తం చేశారు. 

6వ తేదీ వచ్చినా పెన్షన్ దారులకు చెల్లింపులు చేయకుంటే వారి పరిస్థితి ఏమిటి? అని అశోక్ బాబు ప్రశ్నించారు. అప్పులు తేవడం... ఉత్తుత్తి సంక్షేమం పేరుతో బటన్ నొక్కడం... అప్పులకు రీపేమెంట్ చేయడం... గత 4 ఏళ్లుగా జగన్మోహన్ రెడ్డి ఈ మూడు పనులకే పరిమితమయ్యాడని ఆరోపించారు. అధికారంలో ఉన్న తనను ఏం చేస్తారులే అనుకుంటున్న ముఖ్యమంత్రికి రాబోయే రోజుల్లో ఉద్యోగులు, పెన్షనర్లే తగిన సమాధానం చెబుతారని అశోక్ బాబు హెచ్చరించారు. 

మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. “పిల్లలకు దూరంగా బతికే విశ్రాంత ఉద్యోగులకు ప్రభుత్వం సకాలంలో ఇచ్చే పెన్షనే జీవనాధారం. రాష్ట్రంలో 4 లక్షల మంది పెన్షనర్లుంటే, 6వ తేదీ వచ్చినా ఒక్కరికి కూడా ఈ ప్రభుత్వం పెన్షన్ ఇవ్వలేదు.  

రిటైర్డ్, ప్రస్తుతం ఉన్న ఉద్యోగులకు రాష్ట్ర సచివాలయంలో వైద్య సేవల కోసం ఏర్పాటుచేసిన క్లినిక్ లో కూడా ఈ ప్రభుత్వం మందులు ఏర్పాటు చేయలేని హీనస్థితిలో ఉంది. పెన్షనర్లకు సంబంధించి మెడికల్ రీయింబర్స్ మెంట్ నిధుల్ని కూడా ప్రభుత్వం చెల్లించడంలేదు. 

ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ ని ప్రభుత్వం ఆరోగ్యశ్రీలో కలపడం కూడా ఉద్యోగులు, పెన్షనర్ల కు నాణ్యమైన వైద్య సేవల్ని దూరం చేసింది. ఆరోగ్యశ్రీ అనేది ప్రజల కోసం ప్రభుత్వం ఉచితంగా అందించే వైద్యసేవల పథకం. దానిలో ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల వైద్యసేవలను పథకం కలపడం ముమ్మాటికీ వారికి అన్యాయం చేయడమే.

ఉద్యోగులు, పెన్షనర్లు వారి ఆరోగ్య సమస్యలకు సంబంధించి ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్సలు చేయించుకొని బిల్లులు పెడుతుంటే, ప్రభుత్వం వాటిని కూడా క్లియర్ చేయడంలేదు. 

రాష్ట్రాన్ని చీకటి కూపంలోకి నెట్టిన ముఖ్యమంత్రి, ఆర్థికంగా సామాజికంగా అన్ని వ్యవస్థల్ని నాశనం చేశారు. ప్రభుత్వం తక్షణమే పెన్షన్ దారులకు చెల్లించాల్సిన పెన్షన్లు చెల్లించాలి” అని అశోక్ బాబు డిమాండ్ చేశారు.

Ashok Babu
Jagan
Employees
Pensioners
TDP
YSRCP
Andhra Pradesh
  • Loading...

More Telugu News