Nehal Wadhera: వధేరా ఫిఫ్టీ... లేకపోతే ముంబయి కథ మరోలా ఉండేది!
- చెపాక్ స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్ × ముంబయి ఇండియన్స్
- టాస్ గెలిచి ముంబయికి బ్యాటింగ్ అప్పగించిన ధోనీ
- 20 ఓవర్లలో 8 వికెట్లకు 139 రన్స్ చేసిన ముంబయి
- 51 బంతుల్లో 64 పరుగులు చేసిన వధేరా
- పతిరణకు 3 వికెట్లు
చెన్నై సూపర్ కింగ్స్ తో పోరులో తొలుత బ్యాటింగ్ చేసిన ముంబయి ఇండియన్స్ పరుగులు చేసేందుకు ఆపసోపాలు పడింది. 20 ఓవర్లు ఆడి 8 వికెట్లకు 139 పరుగులు మాత్రమే చేశారు.
చెపాక్ స్టేడియంలో ఈ మ్యాచ్ కోసం స్లో పిచ్ ను ఏర్పాటు చేయడంతో ముంబయి ఇండియన్స్ ఆటగాళ్లు టైమింగ్ చేయలేక కష్టాల పాలయ్యారు. మిడిలార్డర్ లో నేహాల్ వధేరా అర్ధసెంచరీ సాధించడంతో ముంబయి ఇండియన్స్ కు ఆ మాత్రం స్కోరైనా వచ్చింది.
చెన్నై సూపర్ కింగ్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోగా, ముంబయి ఇండియన్స్ తొలుత బ్యాటింగ్ కు దిగింది. అయితే చెన్నై బౌలర్లు సొంతగడ్డపై చెలరేగడంతో ముంబయి 14 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. ఆ సమయంలో బరిలో దిగిన నేహాల్ వధేరా సమయోచితంగా ఆడి ఆకట్టుకున్నాడు. వధేరా 51 బంతుల్లో 8 ఫోర్లు, 1 సిక్స్ తో 64 పరుగులు చేశాడు. సూర్యకుమార్ యాదవ్ (26), ట్రిస్టాన్ స్టబ్స్ (20)తో వధేరా విలువైన భాగస్వామ్యాలు నమోదు చేశాడు.
వధేరా అవుటయ్యాక ముంబయి కథ మళ్లీ మొదటికి వచ్చింది. ఆఖర్లో పేసర్ పతిరణ యార్కర్లతో విరుచుకుపడడంతో, గౌరవప్రదమైన స్కోరు సాధించాలనుకున్న ముంబయి ఆశలు నెరవేరలేదు. ముంబయి ఇన్నింగ్స్ చూస్తే... ఫామ్ లో లేని కెప్టెన్ రోహిత్ శర్మ వన్ డౌన్ లో దిగాడు. కామెరాన్ గ్రీన్ (6), ఇషాన్ కిషన్ (7) ఇన్నింగ్స్ ప్రారంభించారు. వీరిద్దరూ కూడా ఎక్కువ సేపు నిలవలేకపోయారు. ఫామ్ కోసం తంటాలు పడుతున్న రోహిత్ శర్మ డకౌట్ అయ్యాడు. ఆఖర్లో టిమ్ డేవిడ్ (2) కూడా నిరాశపరిచాడు.
చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్లలో పతిరణ 3, దీపక్ చహర్ 2, తుషార్ దేశ్ పాండే 2, జడేజా 1 వికెట్ తీశారు.