Asaduddin Owaisi: మణిపూర్ తగలబడుతుంటే.. సైనికులు చనిపోతుంటే.. కర్ణాటకలో రోడ్ షోలా?: మోదీపై అసదుద్దీన్ ఫైర్
- దేశంలో సమస్యలను వదిలి ‘కేరళ స్టోరీ’ గురించి ప్రధాని మాట్లాడటం విచారకరమన్న ఒవైసీ
- ఎన్నికల్లో గెలవడానికి అసత్యాలతో తీసిన సినిమాను ఆశ్రయించారని ఎద్దేవా
- ప్రధాని మాట్లాడుతున్న వీడియోను షేర్ చేసిన ఎంఐఎం అధినేత
ప్రధాని నరేంద్ర మోదీపై ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ విరుచుకుపడ్డారు. మణిపూర్ తగలబడుతుంటే.. జమ్మూకశ్మీర్ లో సైనికులు చనిపోతుంటే.. కర్ణాటకలో ప్రధాని రోడ్ షోలు నిర్వహిస్తున్నారని మండిపడ్డారు.
“పాకిస్థాన్ మద్దతు ఉన్న ఉగ్రవాదులు మన సైనికులను చంపుతున్నారు. ఐదుగురు సైనికుల ప్రాణాలను బలిగొన్నారు. మణిపూర్‌లో హింస చెలరేగుతోంది. గ్రామాలు తగలబడుతున్నాయి. ప్రజలు తమ ఇళ్లు వదిలి పారిపోతున్నారు. కానీ ప్రధాని నరేంద్ర మోదీ మాత్రం కేరళ స్టోరీ అనే ‘ఫిక్షన్’ సినిమా గురించి మాట్లాడటం విచారకరం” అని ఒవైసీ అన్నారు.
‘‘ఎన్నికల్లో గెలవడానికి అసత్యాలు, తప్పుడు ప్రచారాలతో తీసిన సినిమా 'ది కేరళ స్టోరీ'ని నరేంద్ర మోదీ ఆశ్రయించాల్సి వచ్చింది’’ అని ట్వీట్ చేశారు. ఈ మేరకు ప్రధాని మాట్లాడుతున్న వీడియోను షేర్ చేశారు.