Madhya Pradesh: ‘ది కేరళ స్టోరీ’కి పెరుగుతున్న మద్దతు.. బీజేపీ పాలిత రాష్ట్రంలో పన్ను మినహాయింపు

Madhya Pradesh CM Shivraj Chouhan declares that The Kerala Story tax free in his state

  • స్వయంగా ప్రకటించిన మధ్యప్రదేశ్ సీఎం చౌహాన్
  • అనేక వివాదాల నడుమ నిన్న విడుదలైన చిత్రం
  • తొలి రోజే మంచి కలెక్షన్లు 

అదాశర్మ నటించిన ‘ది కేరళ స్టోరీ’ ఇప్పుడు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. సుదీప్తో సేన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం అనేక వివాదాల మధ్య నిన్న థియేటర్లలో విడుదలైంది. దీనికి మిశ్రమ స్పందనలు లభిస్తున్నాయి. కొందరు దీన్ని ప్రచార చిత్రం అంటూ విమర్శిస్తుండగా.. మరో వర్గం అద్భుతంగా ఉందంటూ కీర్తిస్తున్నారు. లవ్ జిహాద్ పేరిట కేరళలో 32 వేల మందికిపైగా యువతులను ట్రాప్ చేసి ఐసిస్ లో చేర్చారని చెబుతూ తీసిన ఈ సినిమాను నిషేధించాలంటూ సుప్రీంకోర్టు వరకూ వెళ్లారు. కాంగ్రెస్, వామపక్షాలు ఈ సినిమాపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. మరోవైపు కేరళలో వాస్తవ పరిస్థితులను కళ్లకు కట్టారంటూ బీజేపీ, హిందూ సంస్థలు ఈ చిత్రాన్ని తప్పకుండా చూడాలంటూ ప్రచారం చేస్తున్నారు.

ఈ క్రమంలో బీజేపీ పాలిత రాష్ట్రం మధ్యప్రదేశ్‌లో ఈ సినిమాకి పన్ను మినహాయింపు లభించింది. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌ స్వయంగా ఈ ప్రకటన చేశారు. చిత్రానికి పన్ను మినహాయింపు ఇవ్వాలని రాష్ట్ర మంత్రి రాహుల్ కొఠారీ.. సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్‌కు గతంలో లేఖ రాసినట్లు సమాచారం. దీనికి చౌహాన్ ఒప్పుకున్నారు. ‘ది కేరళ స్టోరీ చిత్రం ఉగ్రవాదానికి చెందిన భయంకరమైన నిజాన్ని బట్టబయలు చేసింది. మధ్యప్రదేశ్ లో దీనికి ట్యాక్స్ మినహాయిస్తున్నాం’ అని ప్రకటిస్తూ సీఎం వీడియో విడుదల చేశారు. కాగా, ఈ చిత్రానికి మొదటి రోజు దేశవ్యాప్తంగా రూ.ఏడున్నర కోట్ల కలెక్షన్లు వచ్చినట్టు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News