Telangana: ఆసుపత్రిలో దారుణం.. గాయానికి కుట్లు వేయాల్సిందిపోయి ఫెవీక్విక్ రాసి పంపించారు!

Private hospital staff treat kids injury with fewikwik instead of closing it with sutures in Jogulamaba gadwal district

  • జోగులాంబ గద్వాల్ జిల్లాలోని ప్రైవేటు ఆసుపత్రిలో షాకింగ్ ఘటన
  • బాలుడి కనుబొమ్మపై లోతయిన గాయం
  • గాయానికి కుట్లు వేసే బదులు ఫెవీక్విక్ రాసి పంపించిన సిబ్బంది
  • బాలుడి తండ్రి తీవ్ర ఆగ్రహం, పోలీసులకు ఫిర్యాదు

జోగులాంబ గద్వాల్ జిల్లాలో ఓ షాకింగ్ ఘటన వెలుగు చూసింది. బాలుడి కనుబొమ్మపై గాయానికి కుట్లు వేయాల్సిన ఆసుపత్రి సిబ్బంది ఫెవీక్విక్ రాసి ఇంటికి పంపించారు. దీంతో, బాలుడి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

స్థానికంగా చర్చనీయాంశమైన ఈ ఉదంతం పూర్తి వివరాల్లోకి వెళితే..కర్ణాటక  రాయచూరు జిల్లా లింగనూరుకు చెందిన  వంశీకృష్ణ, సునీత దంపుతులు జోగులాంబ్ గద్వాల జిల్లాలో ఓ వివాహ వేడుకు హాజరయ్యేందుకు తమ బంధువుల ఇంటికి వచ్చారు. అయితే, గురువారం రాత్రి వారి కుమారుడు ఆడుకుంటుండగా అతడి కనుబొమ్మపై లోతైన గాయమైంది. దీంతో, కంగారు పడ్డ తల్లిదండ్రులు బాలుడిని సమీపంలోని ఓ ఆసుపత్రికి తరలించారు. 

అయితే, ఆసుపత్రి సిబ్బంది బాలుడికి కుట్లు వేసి చికిత్స చేయాల్సింది పోయి ఫెవీక్విక్ రాసి పంపించారు. దీన్ని గుర్తించిన బాలుడి తండ్రి ఆసుపత్రి తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆసుపత్రి వర్గాలను నిలదీశారు. అయితే, సిబ్బంది పొరపాటు చేసి ఉండొచ్చని ఓ డాక్టర్ వంశీకృష్ణకు నచ్చచెప్పే ప్రయత్నం చేశాడు. బాలుడికి ఏమీ కాదని హామీ ఇచ్చారు. అయితే, వంశీ కృష్ణ మాత్రం అయిజ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఘటనపై విచారణ ప్రారంభించారు. ఇక బాలుడికి ఫెవీక్విక్‌తో చికిత్స చేయడమేమిటని స్థానికులు కూడా ఆసుపత్రిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 


  • Loading...

More Telugu News