LSG: కేఎల్ రాహుల్ స్థానంలో లక్నో జట్టులోకి ఆర్సీబీ మాజీ ప్లేయర్
- కరుణ్ నాయర్ ను నియమించుకున్న లక్నో ఫ్రాంచైజీ
- గతేడాది రాజస్థాన్ తరఫున ఆడిన నాయర్
- ఐపీఎల్ లో అతడికి ఇది పదో సీజన్
లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్ తొడ గాయం కారణంగా ఐపీఎల్ 2023కు పూర్తిగా దూరమయ్యాడు. దీంతో అతడి స్థానంలో మరో ఆటగాడిని లక్నో జట్టు యాజమాన్యం భర్తీ చేసింది. అది కూడా ఆర్సీబీ మాజీ ఆటగాడికి చోటు ఇవ్వడం గమనార్హం. రూ.50 లక్షల ధరకు కరుణ్ నాయర్ ను నియమించుకుంది. గత డిసెంబర్ లో నాయర్ చేసిన ఓ ట్వీట్ ను తాజాగా లక్నో సూపర్ జెయింట్స్ రీట్వీట్ చేసింది.
కరుణ్ నాయర్ టెస్ట్ మ్యాచుల్లో ట్రిపుల్ సెంచరీ చేసిన రెండో ఆటగాడు కావడం గమనార్హం. రంజీ ట్రోఫీలోనూ తనకు చోటు కల్పించకపోవడంతో.. ‘‘డియర్ క్రికెట్ నాకు మరో అవకాశం ఇవ్వవూ’’ అంటూ కరుణ్ నాయర్ గత డిసెంబర్ 10న ఓ ట్వీట్ చేశాడు. అతడు కోరినట్టుగా ఓ అవకాశం కల్పించామన్న అర్థంతో అతడి ట్వీట్ ను ఎల్ఎస్ జీ షేర్ చేసింది.
నాయర్ కు ఇది ఐపీఎల్ లో పదో సీజన్. 76 మ్యాచుల్లో పాల్గొన్న అతడు 1496 పరుగులు సాధించాడు. 2013లో తొలుత ఆర్సీబీ అతడికి అవకాశం ఇచ్చింది. రెండు సీజన్ల పాటు ఆ జట్టు కోసం ఆడాడు. 2014లో రాజస్థాన్ జట్టులోకి వెళ్లాడు. 2016, 2017లో ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున ఆడాడు. ఆ తర్వాత పంజాబ్ జట్టులోకి వెళ్లాడు. 2022 సీజన్ లో రాజస్థాన్ తరఫున మూడు మ్యాచుల్లో పాల్గొన్న అతడు కేవలం 16 పరుగులే చేశాడు. దీంతో అతడ్ని రాజస్థాన్ విడిచి పెట్టింది.