Sharad Pawar: శరద్ పవార్ రాజీనామాను ఏకగ్రీవంగా తిరస్కరించిన ఎన్సీపీ ప్యానల్
- ఎన్సీపీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన శరద్ పవార్
- పార్టీ చీఫ్ గా శరద్ పవారే కొనసాగాలని తీర్మానం చేసిన ప్యానల్ కమిటీ
- దేశంలోని గొప్ప నేతల్లో శరద్ పవార్ ఒకరన్న ప్రఫుల్ పటేల్
ఎన్సీపీ అధ్యక్ష పదవికి శరద్ పవార్ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆయన రాజీనామాను పార్టీ ప్యానల్ తిరస్కరించింది. పార్టీ అధినేతగా ఆయనే కొనసాగాలని తీర్మానించింది. కాసేపటి క్రితం ఎన్సీపీ ప్యానల్ మీటింగ్ ముగిసింది. అనంతరం పార్టీ వైస్ ప్రెసిడెంట్ ప్రఫుల్ పటేల్ మీడియాతో మాట్లాడుతూ... పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్టు మే 2న శరద్ పవార్ ప్రకటించారని... తదుపరి అధ్యక్షుడిని ఎన్నుకోవడానికి పార్టీలోని కీలక నేతలతో కూడిన ఒక కమిటీని ఆయన ఏర్పాటు చేశారని తెలిపారు.
పవార్ రాజీనామా ప్రకటనతో తామంతా షాక్ కు గురయ్యామని... ఆయన నుంచి ఇలాంటి ప్రకటన వస్తుందని తాము ఊహించలేదని చెప్పారు. తనతో పాటు పలువురు నేతలు శరద్ పవార్ ను కలిసి రాజీనామా నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరామని... ప్రస్తుత పరిస్థితుల్లో పార్టీకే కాకుండా, దేశానికి కూడా మీ అవసరం ఉందని చెప్పామని ప్రఫుల్ పటేల్ అన్నారు.
తమకు కనీస సమాచారం కూడా ఇవ్వకుండానే ఆయన రాజీనామా నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. పార్టీ నేతలు, కార్యకర్తల డిమాండ్ల మేరకు ఈరోజు ప్యానల్ కమిటీ భేటీ అయిందని... పార్టీ అధినేతగా పవార్ కొనసాగాలంటూ కమిటీ ఏకగ్రీవంగా తీర్మానం చేసిందని తెలిపారు. దేశంలోని గొప్ప నాయకుల్లో శరద్ పవార్ ఒకరని కొనియాడారు. ఈ సమావేశంలో శరద్ పవార్ కుమార్తె సుప్రియా సూలే, అన్న కుమారుడు అజిత్ పవార్ కూడా పాల్గొన్నారు.