UP civic body: ఎన్నికల ప్రచారంలో రష్యా డ్యాన్సర్లు.. అనుమతించాలంటూ యూపీలో దరఖాస్తు
- ఉచితంగా మద్యం పంపిణీ చేయడానికి అనుమతించాలి
- ఎన్నికల అధికారులకు ఓ అభ్యర్థి దరఖాస్తు
- విచారణ మొదలు పెట్టిన పోలీసులు
ఉత్తరప్రదేశ్ లో పురపాలక ఎన్నికలు రాజకీయ పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారాయి. గెలుపు కోసం అభ్యర్థులు కొత్త మార్గాలను వెతుక్కుంటున్నారు. ఇందులో భాగంగా రష్యా డ్యాన్సర్లను పిలిపించి, వారితో నృత్యం చేయించడం ద్వారా ఓటర్లను ఆకర్షించే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. సాధారణంగా ఏ ఎన్నిక అయినా పెద్ద ఎత్తున మద్యం, డబ్బు పంపిణీ చేస్తున్న రోజులు ఇవి. కానీ, ఉత్తరప్రదేశ్ మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఓ స్వతంత్ర అభ్యర్థి అయితే వీటి కోసం నేరుగా ఎన్నికల అధికారులనే ఆశ్రయించడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.
కాన్పూర్ లోని అంబేద్కర్ నగర్ కు చెందిన సంజయ్ దూబే మున్సిపల్ ఎన్నికలను పర్యవేక్షించే అధికారులకు లేఖ రాశాడు. తాను రాసిన లేఖలో.. రష్యా డ్యాన్సర్లతో తన ఎన్నికల ప్రచారంలో డ్యాన్స్ చేయించేందుకు, ఉచితంగా మద్యం పంపిణీకి అనుమతించాలని కోరాడు. దీనిపై పోలీసులు విచారణ మొదలు పెట్టారు. దీంతో సంజయ్ దూబే స్పందిస్తూ, తాను లేఖ రాయలేదని, కాకపోతే అనుమతి కోరుతూ జిల్లా అధికార యంత్రాంగాన్ని సంప్రదించిన మాట వాస్తవమేనని అంగీకరించారు. యూపీ వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికలకు మే 4, మే 11న రెండు విడతల్లో నిర్వహిస్తున్నారు. నేడు లక్నో, కాన్పూర్ లో పోలింగ్ నడుస్తోంది. సీఎం యోగి ఆదిత్యనాథ్ సైతం ఓటు హక్కు వినియోగించుకున్నారు.