Mumbai Indians: కసితీరా బాదిన ఇషాన్, సూర్య.. భారీ లక్ష్యాన్ని సునాయాసంగా ఛేదించిన ముంబై

Ishan and Surya help Mumbai easy victory against Punjab Kings
  • 215 పరుగుల లక్ష్యాన్ని మరో ఏడు బంతులు ఉండగానే ఛేదించిన ముంబై
  • మరోమారు దారుణంగా నిరాశపరిచిన రోహిత్ శర్మ
  • పంజాబ్ బౌలర్లను చెడుగుడు ఆడేసుకున్న ఇషాన్, సూర్య
  • ఐదో విజయాన్ని ఖాతాలో వేసుకున్న ముంబై
గత మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ చేతిలో ఓటమి పాలైన ముంబై ఇండియన్స్ ఈసారి మాత్రం ప్రతీకారం తీర్చుకుంది. మొహాలీలోని ఐఎస్ బింద్రా స్టేడియంలో జరిగిన హైస్కోరింగ్ మ్యాచ్‌లో చెలరేగి ఆడింది. ఫలితంగా 215 పరుగుల విజయ లక్ష్యాన్ని మరో ఏడు బంతులు మిగిలి ఉండగానే 4 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది.

కెప్టెన్ రోహిత్ శర్మ (0) మారోమారు తీవ్రంగా నిరాశపరిచినా ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. ఇద్దరూ కలిసి పంజాబ్ బౌలర్లను చెడుగుడు ఆడేసుకున్నారు. దీంతో 200 పరుగుల పైచిలుకు లక్ష్యం చిన్నబోయింది. ఇషాన్ కిషన్ 41 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్సర్లతో 75 పరుగులు చేయగా, సూర్యకుమార్ యాదవ్ 31 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్లతో 66 పరుగులు చేసి జట్టును గెలిపించారు. 9 మ్యాచుల్లో ముంబైకి ఇది ఐదో విజయం.

చివర్లో వీరిద్దరూ అవుటయ్యాక గెలుపుపై పంజాబ్ ఆశలు పెంచుకున్నప్పటికీ టిమ్ డేవిడ్ 19 (10 బంతుల్లో 3 ఫోర్లు), హైదరాబాదీ బ్యాటర్ తిలక్ వర్మ 26 (10 బంతుల్లో ఫోర్, 3 సిక్సర్లు) పరుగులు చేసి జట్టుకు అద్వితీయ విజయాన్ని అందించారు. పంజాబ్ బౌలర్లలో నాథన్ ఎల్లిస్‌కు రెండు వికెట్లు దక్కాయి. ఇషాన్ కిషన్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది.

అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ లియామ్ లివింగ్ స్టోన్, జితేశ్ శర్మ వీర బాదుడుతో నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 214 పరుగుల భారీ స్కోరు సాధించింది. లివింగ్ స్టోన్ 42 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్సర్లతో 82, జితేశ్ శర్మ 27 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 49 పరుగులు చేశారు. కెప్టెన్ ధావన్ 30, మాథ్యూ షార్ట్ 27 పరుగులు చేశారు. ముంబై బౌలర్లలో చావ్లాకు రెండు వికెట్లు లభించాయి. ఐపీఎల్‌లో నేడు సన్‌రైజర్స్ హైదరాబాద్, కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య హైదరాబాద్‌లో మ్యాచ్ జరగనుంది.
Mumbai Indians
Punjab Kings
IPL 2023
Ishan Kishan
Suryakumar Yadav

More Telugu News