PBKS: బౌలర్లను చితక్కొట్టి వదిలిపెట్టిన లివింగ్‌స్టోన్, జితేశ్ శర్మ.. ముంబై ఎదుట భారీ లక్ష్యం

Livingstone and Jitesh butchery launches Punjab to 214 Runs

  • మూడు వికెట్ల నష్టానికి 214 పరుగుల భారీ స్కోరు సాధించిన పంజాబ్
  • 42 బంతుల్లో 82 పరుగులు చేసిన లివింగ్‌స్టోన్
  • 27 బంతుల్లో 49 పరుగులు చేసిన జితేశ్ శర్మ
  • 4 ఓవర్లలో 56 పరుగులు సమర్పించుకున్న జోఫ్రా అర్చర్

ముంబై ఇండియన్స్ బౌలర్లను లివింగ్‌స్టోన్, జితేశ్ శర్మ చితక్కొట్టేశారు. బంతులను ఊచకోత కోస్తూ స్టాండ్స్‌లోకి తరలించారు. దీంతో మైదానంలో పరుగుల వర్షం కురిసింది. ముంబై ఇండియన్స్‌తో మొహాలీలో జరుగుతున్న మ్యాచ్‌లో పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 214 పరుగుల భారీ స్కోరు సాధించింది.

ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్.. 13 పరుగులకే ప్రభుసిమ్రన్ (9) రూపంలో తొలి వికెట్ కోల్పోయినప్పటికీ ఆ తర్వాత నిలదొక్కుకుంది. శిఖర్ ధావన్ (30), మాథ్యూ షార్ట్ (27) పెద్ద స్కోరు చేయడంలో విఫలమైనప్పటికీ క్రీజులో పాతుకుపోయిన లియామ్ లివింగ్‌స్టోన్, జితేశ్ శర్మ వీరవిహారం చేశారు. ముంబై బౌలర్లను ఆటాడుకున్నారు. ఫోర్లు, సిక్సర్లతో స్టేడియాన్ని మోతకెక్కించి స్కోరుబోర్డును పరుగులు పెట్టించారు.

లివింగ్‌స్టోన్ 42 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్సర్లతో 82 పరుగులు చేయగా, జితేశ్ శర్మ 27 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 49 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచారు. ముంబై ఇండియన్స్ బౌలర్లలో పీయూష్ చావ్లా రెండు వికెట్లు తీసుకున్నాడు. కాగా, లివింగ్‌స్టోన్, జితేశ్ శర్మ దెబ్బకు జోఫ్రా అర్చర్ నాలుగు ఓవర్లు వేసి ఒక్క వికెట్ తీసుకుని 56 పరుగులు సమర్పించుకున్నాడు.

More Telugu News