Janasena: జగన్ గాల్లో ప్రయాణిస్తుంటే హైవేపై వాహనాలు నిలిపివేయడమా?: నాదెండ్ల
- సీఎం ప్యాలెస్ నుండి బయటకు అడుగు పెడితే హెలికాప్టర్‌లో వెళ్తారన్న నాదెండ్ల
- శ్రీకాకుళంలో రెండు చోట్ల రోడ్డు మీద వాహనాలు నిలిపివేశారని వ్యాఖ్య
- జగన్ లో రోజురోజుకు అభద్రతా భావం పెరుగుతోందన్న జనసేన నేత
ముఖ్యమంత్రి జగన్ తాడేపల్లి ప్యాలెస్ నుండి బయటకు అడుగు పెడితే చాలు హెలికాప్టర్ లో ప్రయాణిస్తారని, అలాంటప్పుడు హైవే మీద తిరిగే వాహనాలు ఎలా అడ్డు అవుతాయో అర్థం కావడం లేదని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు. విజయనగరం జిల్లాలోని భోగాపురం విమానాశ్రయానికి రెండోసారి శంకుస్థాపన కోసం సీఎం జగన్ గాల్లో ప్రయాణించి వెళ్తే శ్రీకాకుళం జిల్లా పలాస వద్ద, అనకాపల్లి జిల్లా నక్కపల్లి వద్ద జాతీయ రహదారిపై వాహనాలు నిలిపివేయడం విచిత్రంగా ఉందన్నారు.
వాహనాలు ఇలా నిలిపివేయడం వల్ల వాహనదారులు ఇబ్బందులు పడ్డారని అన్నారు. రోడ్డు మీదకు వస్తే పరదాలు కట్టించుకోవడం, దుకాణాలు మూసివేయడం, గాల్లో సీఎం విమానం పోతుంటే కింద రోడ్డు మీద వాహనాలు ఆపివేయడం చూస్తుంటే జగన్ లో రోజురోజుకు అభద్రతాభావం ఎంతలా పెరిగిపోతుందో తెలుస్తోందన్నారు. పోలీసుల అత్యుత్సాహానికి పరాకాష్ఠగా భోగాపురానికి అటూ ఇటూ 150 కిలో మీటర్ల మేర హైవేపై వాహనాలు ఆపివేశారని, దీంతో సామాన్యులు ఇబ్బందులు పడ్డారన్నారు.