Venkaiah Naidu: బూతులు మాట్లాడేవాళ్ల చరిత్రను పోలింగ్ బూత్ లలో మార్చేయాలి: వెంకయ్యనాయుడు
- రాజకీయ నాయకుల వ్యాఖ్యలు జుగుప్సాకరంగా ఉన్నాయన్న వెంకయ్య
- ఎప్పుడు ఏ పార్టీ జెండా పట్టుకుంటారో కూడా తెలియని పరిస్థితి ఉందని విమర్శ
- పత్రికా రంగంలో కూడా ప్రమాణాలు పడిపోతున్నాయని ఆవేదన
రాజకీయ నాయకుల వ్యాఖ్యలు జుగుప్సాకరంగా తయారయ్యాయని మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు విమర్శించారు. బూతులు మాట్లాడే నాయకుల చరిత్రను పోలింగ్ బూత్ లలో మార్చేయాలని సూచించారు. తుపాకీ గుండుతో విప్లవం రాదని... ప్రజల ఆలోచనలతోనే విప్లవం రావాలని చెప్పారు. దేవస్థానాల్లో ప్రమాణాలు చేసే రాజకీయాలు కూడా పెరిగిపోతున్నాయని దుయ్యబట్టారు.
ఎవరు ఎప్పుడు ఏ పార్టీ జెండా పట్టుకుంటారో కూడా తెలియని పరిస్థితి నెలకొందని అన్నారు. సిద్ధాంతాలు నచ్చకపోతే పార్టీలు మారొచ్చని... కానీ, పదవుల కోసం పార్టీలు మారుతున్నారని విమర్శించారు. రాజకీయాల్లో, ప్రజా సభల్లో, పత్రికా రంగాల్లో ప్రమాణాలు పడిపోతున్నాయని... ఈ ధోరణి దేశ గౌరవానికి ముప్పు అని అన్నారు. గుంటూరులోని రెవెన్యూ కల్యాణ మంటపంలో తెలుగు జర్నలిస్టులకు ఉగాది పురస్కార కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా వెంకయ్య మాట్లాడుతూ పైవ్యాఖ్యలు చేశారు.