new secretariat: కొత్త సెక్రటేరియట్ లోకి ప్రవేశానికి ఇబ్బందిపడ్డ అధికార పార్టీ ఎమ్మెల్యేలు

Even BRS mlas also not permited to enter into the new secretariat on first day

  • సెక్రటేరియట్ ఉద్యోగులకూ అదే అనుభవం
  • ఐడీ కార్డులు చూపించినా వినిపించుకోని సెక్యూరిటీ సిబ్బంది
  • సోమవారం విధులకు హాజరుకాలేకపోయిన ఉద్యోగులు
  • స్పష్టమైన ఆదేశాలు లేకపోవడంవల్లేనని సమాచారం

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన కొత్త సెక్రటేరియట్ లోకి సామాన్యులనే కాదు అధికార పార్టీ ఎమ్మెల్యేలను కూడా సెక్యూరిటీ సిబ్బంది అనుమతించలేదు. సోమవారం మొదటిరోజు సెక్రటేరియట్ కు వచ్చిన ఉద్యోగులకూ ఇదే అనుభవం ఎదురైంది. తాము ఉద్యోగులమని, విధులకు హాజరయ్యేందుకు వచ్చామని చెప్పినా వినిపించుకోలేదు. తమ ఐడెంటిటీ కార్డులు చూపినా వాటి ఆధారంగా లోపలికి అనుమతించలేమని సెక్యూరిటీ సిబ్బంది చెప్పారని ఉద్యోగులు వాపోయారు.

దీంతో కొంతమంది తమ ఉన్నతాధికారులతో సెక్యూరిటీ సిబ్బందికి ఫోన్ చేయించి లోపలికి వెళ్లగా.. మరికొందరు మాత్రం విధులకు హాజరుకాలేకపోయారు. ఎవరిని లోపలికి అనుమతించాలి, ఏ గేటు నుంచి ఎవరికి ప్రవేశం కల్పించాలనే విషయంలో సెక్యూరిటీ సిబ్బందికి ఉన్నతాధికారుల నుంచి స్పష్టమైన ఆదేశాలు లేకపోవడం వల్లే ఈ పరిస్థితి ఎదురైందని తెలుస్తోంది.

ఆదివారం సచివాలయం ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరు కాలేకపోయిన కొంతమంది అధికార పార్టీ ఎమ్మెల్యేలు సోమవారం సెక్రటేరియట్ కు వచ్చారు. కొత్త సెక్రటేరియట్ సందర్శించి, ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలుసుకోవాలని వచ్చిన ఆ ఎమ్మెల్యేలకు చేదు అనుభవం ఎదురైంది. వారిని కూడా సెక్యూరిటీ సిబ్బంది లోపలికి అనుమతించలేదు.

పైనుంచి ఆదేశాలు వస్తే తప్ప లోపలికి వదలబోమని తేల్చి చెప్పారు. దీంతో చేసేదేంలేక ఆ ఎమ్మెల్యేలు వెనక్కి తిరిగారు. కొంతమంది ఎమ్మెల్యేలను మాత్రం కొన్ని గంటల తర్వాత లోపలికి అనుమతించినట్లు సమాచారం. మరోవైపు, అధికారిక సమావేశంలో పాల్గొనేందుకు వచ్చిన వైద్య శాఖ అధికారులు కూడా సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకోవడంతో వెనుదిరిగారు.

More Telugu News