Kangana Ranaut: స్వలింగ వివాహాలపై కంగనా ఏమన్నదంటే...!
- స్వలింగ వివాహాలపై సుప్రీంలో విచారణ
- చట్టబద్ధతకు ససేమిరా అంటున్న కేంద్రం
- రెండు మనసులు కలవడం ముఖ్యమన్న కంగనా
- వారి లింగ గుర్తింపును పట్టించుకోవాల్సిన అవసరంలేదని వెల్లడి
స్వలింగ వివాహాలు భారతీయ కుటుంబ వ్యవస్థకే విఘాతం అని కేంద్ర ప్రభుత్వం ఇటీవల సుప్రీంకోర్టులో స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఇలాంటి వివాహాలకు చట్టబద్ధతను కల్పించలేమని కేంద్రం చెబుతోంది. ఈ అంశంపై బాలీవుడ్ నటి కంగనా రనౌత్ స్పందించారు.
ఎక్కడైనా వివాహానికి రెండు మనసులు కలవడం ముఖ్యం అని, వారు ఎవరన్నది ముఖ్యం కాదని స్పష్టం చేశారు. ఇద్దరు వ్యక్తుల మధ్య అనుబంధం ఏర్పడినప్పుడు వారి లింగ గుర్తింపు ఏమిటన్న అంశానికి ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరంలేదని పేర్కొన్నారు.
ఇలాంటి వారి వ్యక్తిగత జీవితాల్లోకి ప్రజలు తొంగిచూడడం మానుకోవాలని కంగనా అభిప్రాయపడ్డారు. హరిద్వార్ ను సందర్శించిన సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. ఇటీవల రాసిన ఓ సందేశంలోనూ కంగనా ఇలాంటి అభిప్రాయాలనే పంచుకున్నారు.
"మీరు పురుషుడు/స్త్రీ/ఇంకెవరైనా కానివ్వండి... మీ లింగ గుర్తింపు ఏంటన్నది మీకు మాత్రమే సంబంధించిన విషయం. ఇతరులకు సంబంధం లేని విషయం అది. ఇది ఆధునిక ప్రపంచం. నటీమణులు, మహిళా దర్శకులు అనే రోజులు పోయాయి... ఇప్పుడు మహిళలనైనా సరే నటులు, దర్శకులు అనే అంటున్నారు. ఈ ప్రపంచంలో మీరేం చేస్తున్నారన్నదే మీ గుర్తింపు... అంతేతప్ప మీరు పడకగదిలో ఏంచేస్తున్నార్నది కాదు. అయితే లైంగిక ప్రాధాన్యతలను పడకగది వరకే పరిమితం చేసుకోవాల్సిన అవసరం ఉంది. వాటిని ఓ ఐడీ కార్డులాగా మెడలో వేసుకుని ప్రతి చోటా ప్రదర్శించకండి" అంటూ కంగనా పేర్కొన్నారు.