Tim David: ఇది టిమ్ డేవిడ్ రోజు... భారీ టార్గెట్ అంతుచూసిన ముంబయి

Tim David back to back sixes seals super victory for MI over RR

  • 14 బంతుల్లో 45 పరుగులు చేసిన టిమ్ డేవిడ్
  • ఆఖరి ఓవర్లో ముంబయి విజయానికి 17 పరుగులు
  • వరుసగా మూడు బంతుల్లో మూడు సిక్సులు కొట్టిన టిమ్ డేవిడ్
  • మరో 3 బంతులు మిగిలుండగానే 213 పరుగుల టార్గెట్ ఛేదించిన ముంబయి

హార్డ్ హిట్టర్ టిమ్ డేవిడ్ సంచలన ఇన్నింగ్స్ ఆడిన వేళ ముంబయి ఇండియన్స్ కొండంత లక్ష్యాన్ని కరిగించేసింది. రాజస్థాన్ రాయల్స్ తో ఇవాళ సొంతగడ్డపై జరిగిన పోరులో ముంబయి ఇండియన్స్ 6 వికెట్ల తేడాతో ఘనంగా గెలిచింది. 213 పరుగుల భారీ లక్ష్యఛేదనలో ముంబయి 4 వికెట్లు కోల్పోయి మరో 3 బంతులు మిగిలుండగానే మ్యాచ్ ను ఫినిష్ చేసింది. 

ఆఖరి ఓవర్లో ముంబయి విజయానికి 17 పరుగులు అవసరం కాగా... జాసన్ హోల్డర్ విసిరిన ఆ ఓవర్లో టిమ్ డేవిడ్ హ్యాట్రిక్ సిక్సులు బాది రాజస్థాన్ రాయల్స్ ఆశలపై నీళ్లు చల్లాడు. హోల్డర్ ఆ మూడు బంతులను ఫుల్ టాస్ లు వేయగా, టిమ్ డేవిడ్ మరేమీ ఆలోచించకుండా శక్తి కొద్దీ వాటిని స్టాండ్స్ లోకి పంపాడు. ఈ పొడగరి బ్యాట్స్ మన్ కేవలం 14 బంతులాడి 2 ఫోర్లు, 5 సిక్సులతో 45 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. తెలుగుతేజం తిలక్ వర్మ 29 పరుగులతో టిమ్ డేవిడ్ కు చక్కని సహకారం అందించాడు. 

అంతకుముందు, రాజస్థాన్ రాయల్స్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. యశస్వి జైస్వాల్ (124) అద్భుత సెంచరీ సాధించడంతో రాజస్థాన్ రాయల్స్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 212 పరుగులు చేసింది. 

అనంతరం లక్ష్యఛేదనలో ముంబయి ఇండియన్స్ కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. కెప్టెన్ రోహిత్ శర్మ (3) సింగిల్ డిజిట్ స్కోరుతోనే సరిపెట్టుకున్నాడు. మరో ఓపెనర్ ఇషాన్ కిషన్ 28, వన్ డౌన్ బ్యాట్స్ మన్ కామెరాన్ గ్రీన్ 44 పరుగులతో ముంబయి ఇన్నింగ్స్ ను చక్కదిద్దారు. 

ఆ తర్వాత వచ్చిన సూర్యకుమార్ యాదవ్ అర్ధసెంచరీ సాధించడం విశేషం. సూర్య తన 360 డిగ్రీస్ ట్రేడ్ మార్కు షాట్లతో అలరించాడు. సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ జోడీ కీలక భాగస్వామ్యం కారణంగా ముంబయి విజయం దిశగా పయనించింది. 

సూర్యకుమార్ అవుటైన తర్వాత తిలక్ వర్మ కొద్దిగా నిదానించినా, టిమ్ డేవిడ్ తన పవర్ హిట్టింగ్ తో పరిస్థితిని మార్చేశాడు. భారీ షాట్లతో రాజస్థాన్ రాయల్స్ బౌలర్లను బెంబేలెత్తించాడు. రాజస్థాన్ బౌలర్లలో రవిచంద్రన్ అశ్విన్ 2, ట్రెంట్ బౌల్ట్ 1, సందీప్ శర్మ 1 వికెట్ తీశారు.

  • Loading...

More Telugu News