Nara Lokesh: యువగళంలో ఆసక్తికర పరిణామం... లోకేశ్ పాదయాత్రలో జనసేన కార్యకర్తలు
- ఎమ్మిగనూరు నియోజకవర్గంలో లోకేశ్ పాదయాత్ర
- లోకేశ్ కు మద్దతుగా పాదయాత్రలో నడిచిన జనసైనికులు
- ధనిక సీఎం జగన్ కు, పేదలకు మధ్య యుద్ధం జరుగుతోందన్న లోకేశ్
- జగన్ ఇక ధైర్యంగా రోడ్డు మీద తిరగడం సాధ్యం కాదని వెల్లడి
ఎమ్మిగనూరు అసెంబ్లీ నియోజకవర్గంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగళం పాదయాత్ర ఆదివారం దుమ్మురేపింది. 85వ రోజు పాదయాత్ర ఎమ్మిగనూరు శివారు ఈఎన్ వి వే బ్రిడ్జి నుంచి ప్రారంభమైంది. వరుణదేవుడు స్వాగతం పలుకగా లోకేశ్ పాదయాత్ర ప్రారంభించారు. అడుగడుగునా మహిళలు, యువకులు, వృద్ధులు యువనేతకు ఘనస్వాగతం పలికారు. దారిపొడవునా గజమాలలతో సత్కరించి బాణాసంచా మోతలు, డప్పు శబ్ధాలతో హోరెత్తించారు.
ఇవాళ పాదయాత్రలో అత్యంత ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. యువగళానికి సంఘీభావంగా జనసేన కార్యకర్తలు పాదయాత్రలో పాల్గొని సందడి చేశారు. లోకేశ్ కు మద్దతుగా పాదయాత్రలో నడిచారు. టీడీపీ అధినేత చంద్రబాబును జనసేనాని పవన్ కల్యాణ్ హైదరాబాదులో కలిసిన మరుసటి రోజే ఈ పరిణామం చోటు చేసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది.
మాచాపురంలో ఇటీవల 12 ఎకరాలు వ్యవసాయం చేసి తన భర్త ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పిన రంగమ్మకు హామీ ఇచ్చిన రెండురోజుల్లోనే యువనేత ఆదివారం చెక్కు అందజేశారు. ఎమ్మిగనూరు బహిరంగసభలో రంగమ్మను పిలిచి చెక్కు ఇచ్చి తమ మాట నిలబెట్టుకున్నారు.
ఎమ్మిగనూరు సభలో లోకేశ్ వ్యాఖ్యల హైలైట్స్...
- పేదలు ఎప్పటికీ పేదలు గానే ఉండాలి అనేది దేశంలోనే ధనిక సీఎం జగన్ కోరిక. పేదరికం లేని రాష్ట్రం చూడాలన్నది మీ లోకేశ్ కోరిక. ధనిక సీఎం జగన్ కి పేదలకి మధ్య ఇప్పుడు యుద్ధం జరుగుతోంది.
- పరదాల సీఎం ప్రజల్లో తిరిగే నన్ను అడ్డుకోవడానికి అనేక కుట్రలు చేశాడు. జిఓ1 తెచ్చాడు... మడిచి పెట్టుకో అని చెప్పా. పోలీసులతో వచ్చాడు అంబేద్కర్ గారి రాజ్యాంగం చూపించా. లాస్ట్ ట్రయల్ గా వైసీపీ కుక్కల్ని పంపాడు... తన్ని పంపాం.
- నన్ను అడ్డుకోవడం నీ తరం కాదు. నువ్వు రోడ్డు మీద ధైర్యంగా తిరగడం సాధ్యం కాదు.
- మొన్న హెలికాఫ్టర్లో టెక్నికల్ ప్రాబ్లెమ్ వచ్చిందని రోడ్డు మార్గంలో వెళ్లాడు పరదాల సీఎం. ధర్మవరం నియోజకవర్గంలో న్యాయం చెయ్యాలి అంటూ రైతులు పరదాల సీఎం కాన్వాయ్ కి అడ్డం పడుకున్నారు. కనీసం ఆగకుండా రైతులను ఈడ్చి పడేశారు. ఒక్క క్షణం ఆగి వారి సమస్య వినే ఓపిక లేదు ఈ పరదాల సీఎంకి.
- జగన్ త్వరలో కొత్త జీవో తెస్తాడు. అదేంటో తెలుసా చంచల్ గూడా జైలు పేరు జగన్ గూడా జైలు గా మార్చే జీవో.
- సాధారణంగా మనం ఇళ్లలో నలుగురు కూర్చుని భోజనం చేస్తుంటే యోగక్షేమాల గురించి మాట్లాడుకుంటాం. జగన్ ఫ్యామిలీ కూర్చుంటే ఎప్పుడు ఎవరు జైలుకు పోతారో అన్న ఊసులే విన్పిస్తాయి. బాబాయ్ ని చంపిన కేసులో మరో బాబాయ్ చంచల్ గుడా జైలుకి పోవడమే దేవుడి స్క్రిప్ట్. త్వరలో అబ్బాయిలు కూడా చంచల్ గూడా జైలుకి పోవడం ఖాయం.
- ఎమ్మిగనూరులో ప్రజల ఎనర్జీ చూసిన తరువాత జగన్ కి జ్వరం రావడం ఖాయం అని ఫిక్స్ అయ్యాను.
- నన్ను ఆపడం సాధ్యం కాదని జగన్ కి అర్థమైపోయింది. అందుకే ఇప్పుడు భారతి రెడ్డి గారిని రంగంలోకి దింపాడు. లోకేశ్ దళితుల్ని అవమానించాడు అంటూ ఒక ఫేక్ వీడియో తయారు చేసి సాక్షిలో హడావిడి చేశారు భారతి రెడ్డి గారు.
- దళితులకు జగన్ పీకింది, పొడిచింది ఏమి లేదు అని నేను అన్నాను. అక్కడ మీటింగ్ లో ఉన్న దళితులు అంతా చప్పట్లు కొట్టారు. నేను మరోసారి సవాల్ చేస్తున్నా.. అమ్మా భారతి రెడ్డి గారు నేను దళితుల్ని అవమానించినట్టు నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటాను. మీ వీడియో ఫేక్ అని తేలితే సాక్షి మీడియా మూసేస్తారా?
లోకేశ్ చెప్పిన ఆసక్తికర కథ...
వివేకా గారి మర్డర్ గురించి జగన్ అండ్ కో చెప్పిన కథలు విన్న తరువాత నాకో కథ గుర్తొచ్చింది. అనగనగా ఇడుపులపాయ అని ఒక ఊరు ఉంది. ఆ ఊరిని ఆనుకొని ఒక ఏరు ఉంది. వర్షాకాలంలో ఆ ఏరుకి వరద వచ్చింది. అందరూ ఊరు ఖాళీ చేసి ఏరు దాటుతున్నారు.
ఆ ఊర్లో జగన్నాథ్ అని ఒక వ్యక్తి ఉన్నాడు. అతను కూడా అందరి లానే తన దగ్గర ఉన్న తెప్పలో కుటుంబాన్ని ఎక్కించుకొని ఏరు దాటుతున్నాడు. తెప్పలో జగన్నాథ్, బాబాయ్, తమ్ముడు, భార్య కూడా ఉన్నారు. వరద బాగా పెరిగింది. తెప్ప ప్రమాదంలో పడింది. ఏరు దాటాలి అంటే తెప్పలో బరువు తగ్గాలి.
అప్పుడు జగన్నాథ్ బాబాయ్ ని ఏట్లోకి గెంటేశాడు. మళ్లీ వరద పెరిగింది ఇంకొకరిని గెంటేయ్యాలి. అప్పుడు తమ్ముడ్ని గెంటేశాడు. మళ్లీ వరద పెరిగింది... తెప్ప తిరగబడేలా ఉంది. ఇప్పుడు ప్రశ్న ఏంటీ అంటే భార్యను గెంటేస్తాడా? లేక ఆయన్ని భార్య గెంటేస్తుందా?
క్యాష్ కేశవ రూటే సపరేటు!
ఎమ్మిగనూరు ఎక్కడికో వెళ్ళిపోతుంది అని మీరు చెన్నకేశవ రెడ్డి గారిని గెలిపించారు. ఎవరికైనా వయస్సు పెరిగే కొద్ది డబ్బు మీద ఆశ తగ్గుతుంది. కానీ మీ ఎమ్మెల్యే గారికి వయసుతో పాటు డబ్బు మీద ఆశ పెరుగుతుంది. అందుకే ఎమ్మెల్యే పేరు మార్చాను... ఆయన చెన్నకేశవ కాదు క్యాష్ కేశవ.
నియోజకవర్గాన్ని దోచుకోవడం కోసం ఆయన నాలుగు కలెక్షన్ బ్రాంచులు ఓపెన్ చేశారు. కలెక్షన్ కేశవ ఒక బ్రాంచ్ కి ఎండీ, కొడుకు జగన్మోహన్ రెడ్డి ఒక బ్రాంచ్ కి ఎండీ, అల్లుడు ఒక బ్రాంచ్ కి ఎండీ, ఇక క్యాష్ కేశవ అనుచరులది ఒక బ్రాంచ్.
ఎమ్మిగనూరులో ప్రజలు ప్రశాంతత కోల్పోయారు. భూకబ్జాలు, కమిషన్లు, దాడులకు అడ్డాగా మారిపోయింది. దేవుడ్ని కూడా వదలలేదు కలక్షన్ కేశవ. ఆయన సొంత ఊరు కడిమెట్లలో సర్వే నంబర్ 70, 583 లో ఉన్న 30 ఎకరాల దేవాదాయ భూమిని తన పేరు మీద ఆన్ లైన్ చేసుకున్నారు.
ఒక్కో షాపునకు రూ.10లక్షల రేటు!
ఎమ్మిగనూరు టౌన్ లో టెండర్లు లేకుండా ప్రభుత్వ స్థలంలో షాపులు నిర్మాణం చేశారు. ఒక్కో షాపుకి గుడ్ విల్ కింద 10లక్షలు వసూలు చేశారు కలెక్షన్ కేశవ. ఎమ్మిగనూరులో ఏ అభివృద్ధి కార్యక్రమం జరగాలి అన్నా కలెక్షన్ కేశవకు 10 శాతం వాటా ఇవ్వాలి అంట.
ఇక ఎమ్మిగనూరులో ఎవరు రియల్ ఎస్టేట్ వెంచర్ వెయ్యాలి అన్నా క్యాష్ కేశవ కొడుకు జగన్మోహన్ రెడ్డికి 10 శాతం కప్పం కట్టాల్సిందే. టీడీపీ హయాంలో సీసీఐ ద్వారా పత్తి కొనుగోలు జరిగేది. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత ఆ విధానాన్ని రద్దు చేసి ప్రైవేట్ వ్యాపారులతో పత్తి కొనుగోలు చేయిస్తున్నారు.
పత్తి అమ్మడానికి వచ్చిన ప్రతి వాహనం నుండి వేల రూపాయిలు వసూలు చేస్తున్నాడు క్యాష్ కేశవ అల్లుడు. ప్రస్తుతం మన సభ జరుగుతున్న ఎమ్మిగనూరు వీవర్స్ సొసైటీ గ్రౌండ్ ని కొట్టేయడానికి స్కెచ్ వేశారు కలెక్షన్ కేశవ.
లోకేశ్ ను కలిసిన కాంట్రాక్ట్ లెక్చరర్లు
ఎమ్మిగనూరు ఎన్ఆర్ ఫంక్షన్ హాలువద్ద కాంట్రాక్ట్ లెక్చరర్లు లోకేశ్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక రాష్ట్రవ్యాప్తంగా వివిధ కళాశాలల్లో ఖాళీగా ఉన్న లెక్చరర్ పోస్టులను భర్తీచేయాలని, పోస్టుల భర్తీలో కాంట్రాక్ట్ లెక్చరర్లకు వెయిటేజి ఇవ్వాలని కోరారు.
అందుకు లోకేశ్ స్పందిస్తూ... అవగాహనా రాహిత్యంతో రాష్ట్రంలో ఉన్నత విద్యా వ్యవస్థను వైసీపీ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని విమర్శించారు. కరోనా సమయంలో జీతాలు ఇవ్వకపోవడంతో ఎంతో మంది కాంట్రాక్ట్ లెక్చరర్లు ఆత్మహత్యలు చేసుకున్నారని వెల్లడించారు.
"కాంట్రాక్ట్ లెక్చరర్లకు సకాలంలో వేతనాలు అందించి, వారి సమస్యలను పరిష్కరిస్తాం. పేద పీజీ విద్యార్థులకు గొడ్డలిపోటుగా పరిణమించిన జీవో నెం.77ని రద్దుచేసి, పాత ఫీజు రీయింబర్స్ మెంట్ విధానాన్ని కొనసాగిస్తాం. లెక్చరర్ పోస్టులతోపాటు రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా ఉన్న పోస్టులన్నింటినీ భర్తీచేస్తాం. ఆదోనిలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల నిర్మిస్తాం" అని హామీ ఇచ్చారు.
నారా లోకేశ్ ను కలిసిన పిడిఎస్ యు విద్యార్థి సంఘనేతలు
ఎమ్మిగనూరు ఎస్ బిఐ సర్కిల్ వద్ద పిడిఎస్ యు విద్యార్థి సంఘాల నేతలు లోకేశ్ ను కలిసి తాము ఎదుర్కొంటున్న సమస్యలపై వినతిపత్రం సమర్పించారు.
అందుకు లోకేశ్ స్పందిస్తూ... నాడు – నేడు పనుల్లో వైసీపీ నేతలు పెద్దమొత్తంలో అవినీతికి పాల్పడుతున్నారని మండిపడ్డారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల పాలిట వరంగా ఉన్న బెస్ట్ అవెయిలబుల్ స్కూళ్లను ఈ ప్రభుత్వం రద్దు చేసిందని ఆరోపించారు.
"టీడీపీ రాగానే బెస్ట్ అవెయిలబుల్ స్కూళ్లను ప్రవేశపెట్టడంతో పాటు, హాస్టళ్లను వేగంగా నిర్మిస్తాం. జీవో నెం.77ని రద్దుచేసి పాత ఫీజు రీయింబర్స్ మెంట్ విధానాన్ని ప్రవేశపెడతాం. ప్రతిఏటా జాబ్ నోటిఫికేషన్ విడుదల చేస్తామని జగన్ రెడ్డి ఇచ్చిన హామీని మర్చిపోయారు. టీడీపీ అధికారంలోకి రాగానే ప్రతిఏటా జాబ్ క్యాలండర్ ఇస్తాం" అని వెల్లడించారు.
పాదయాత్ర వివరాలు
ఇప్పటి వరకు నడిచిన దూరం 1088.1 కి.మీ.
ఈరోజు నడిచిన దూరం 7.0 కి.మీ.
86వ రోజు (1-5-2023) యువగళం వివరాలు:
ఎమ్మిగనూరు అసెంబ్లీ నియోజకవర్గం (కర్నూలు జిల్లా):
ఉదయం
7.00 – ఎమ్మిగనూరు శివారు క్యాంప్ సైట్ నుంచి పాదయాత్ర ప్రారంభం.
7.30 – కడిమెట్ల మదర్ థెరెస్సా కాలేజి వద్ద స్థానికులతో మాటామంతీ.
7.45 – కడిమెట్ల ఫక్రీ సాదర్ చౌక్ లో బిసిలతో సమావేశం.
8.25 – కడిమెట్ల మహాలక్ష్మి కాటన్ మిల్ వద్ద బుడగజంగాలతో సమావేశం.
9.35 – ఎర్రకోట వద్ద వికలాంగులతో భేటీ.
11.45 – రాళ్లదొడ్డిలో బీసీ సామాజికవర్గీయులతో ముఖాముఖి.
మధ్యాహ్నం
12.45 – రాళ్లదొడ్డిలో భోజన విరామం.
సాయంత్రం
4.00 - రాళ్లదొడ్డి నుంచి పాదయాత్ర కొనసాగింపు.
5.00 – గోనెగండ్ల ఆర్చి వద్ద స్థానికులతో మాటామంతీ.
5.10 – పాదయాత్ర 1100 కి.మీ. చేరిక, శిలాఫలకం ఆవిష్కరణ.
5.20 – గోనెగండ్ల గింజిపల్లి క్రాస్ వద్ద వాల్మీకిలతో సమావేశం.
5.40 – గోనెగండ్ల ఎంపీడీఓ ఆఫీసు క్రాస్ వద్ద మైనారిటీలతో సమావేశం.
6.00 – గోనెగండ్ల ఎస్ బిఐ సర్కిల్ వద్ద స్థానికులతో సమావేశం.
6.20 – గోనెగంట్ల హరిజన స్కూలు వద్ద ఎస్సీ సామాజికవర్గీయులతో సమావేశం.
7.45 – గాజులదిన్నె విడిది కేంద్రంలో బస.