Etela Rajender: కేసీఆర్ ఇప్పటికైనా సచివాలయానికి వస్తారని భావిస్తున్నాను: ఈటల

Etala Rajenders questions KCR about secretariate entry
  • ఉమ్మడి ఏపీలో 8 కోట్ల మందికి సచివాలయం సరిపోయిందని వ్యాఖ్య
  • ఆనవాళ్లు ఉండవద్దనే కొత్త సచివాలయ నిర్మాణమన్న ఈటల
  • చరిత్రలో తానే గొప్పవాడిగా నిలిచే ప్రయత్నం కేసీఆర్ ది అన్న బీజేపీ నేత
  • సచివాలయం వచ్చి ప్రజల సమస్యలు వింటాడని ఆశిస్తున్నానన్న ఈటల
గత తొమ్మిదేళ్లలో సచివాలయానికి రాని ముఖ్యమంత్రి కేసీఆర్, కొత్త సచివాలయ ప్రారంభం నేపథ్యంలో ఇప్పుడైనా వస్తారని తాను భావిస్తున్నానని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలోను హైదరాబాద్ రాజధానిగా ఉందని, అప్పుడు ఎనిమిది కోట్ల మంది ప్రజలకు సరిపడా సచివాలయం ఉందన్నారు. 

ఉమ్మడి రాష్ట్రానికి సరిపడే విధంగా నాడు గొప్పగా సచివాలయం ఉండేదని, కానీ, ఆనాటి నాయకుల ఆనవాళ్లు ఉండకూడదనే కొత్త సచివాలయాన్ని కట్టుకున్నారని కేసీఆర్ పై విమర్శలు గుప్పించారు. ఆయన హుజురాబాద్ లో మీడియాతో మాట్లాడారు.

చరిత్రలో తానే గొప్పవాడిగా నిలిచిపోవాలనే ఉద్దేశంతో కేసీఆర్ కొత్త సచివాలయాన్ని నిర్మించాడని చెప్పారు. సచివాలయాన్ని కట్టడానికి తాను వ్యతిరేకం కాదని, కానీ ఆయన ప్రతిష్ఠ కోసం, ఆయన పేరు కోసం దీనిని కట్టినట్లుగా భావిస్తున్నానని చెప్పారు. 

ఎన్నివేల కోట్లు ఖర్చు పెట్టారు, దాని వెనుక ఏమి ఉన్నదనే విషయం గురించి తాను మాట్లాడదల్చుకోలేదన్నారు. కానీ తన డిమాండ్ ఒక్కటేనని, గతంలో ఎప్పుడూ సచివాలయానికి లేదా ఆఫీస్ కు రాని ముఖ్యమంత్రి, కనీసం ఇప్పుడు కొత్త సచివాలయం కట్టిన తర్వాత అయినా ఆయన వస్తాడని భావిస్తున్నానని చెప్పారు.

సచివాలయానికి వచ్చి, ప్రజలను కలుస్తాడని తాను ఆశిస్తున్నానని ఈటల అన్నారు. సచివాలయంలో సాయంత్రం మూడు గంటల నుండి ఐదు గంటల వరకు ప్రజల సందర్శన కోసం తెరిచే సౌకర్యం ఉండేదని, ఇప్పుడు అది నిలిచిపోయిందన్నారు. కేసీఆర్ ఈ తొమ్మిదేళ్లలో ప్రజల్ని, అధికారులను... ఇలా ఎవరినీ కలవలేదన్నారు. ఏ మంత్రి ఆఫీస్ ఎక్కడ ఉందో కూడా ఎవరికీ తెలియని పరిస్థితి ఏర్పడిందన్నారు.
Etela Rajender
KCR

More Telugu News