MS Dhoni: ధోనీ కొట్టింది రెండు సిక్సులే... కానీ స్టేడియంలో పూనకాలు!
- చెపాక్ స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్ × పంజాబ్ కింగ్స్
- టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సీఎస్కే
- 20 ఓవర్లలో 4 వికెట్లకు 200 పరుగులు
- 92 పరుగులతో అజేయంగా నిలిచిన ఓపెనర్ డెవాన్ కాన్వే
- ఆఖరి ఓవర్లో చివరి రెండు బంతులను స్టాండ్స్ లోకి కొట్టిన ధోనీ
చెపాక్ స్టేడియం ఇవాళ పూర్తిగా పసుపుమయం అయింది. చెన్నై సూపర్ కింగ్స్ ఇవాళ మ్యాచ్ ఆడుతుండడమే అందుకు కారణం. పంజాబ్ కింగ్స్ పై టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న చెన్నై జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 200 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది.
ఓపెనర్ డెవాన్ కాన్వే అద్భుతంగా బ్యాటింగ్ చేసి 92 పరుగులతో అజేయంగా నిలవడం విశేషం. కాన్వే 52 బంతుల్లో ఈ పరుగులు చేశాడు. అతడి స్కోరులో 16 ఫోర్లు, 1 సిక్స్ ఉన్నాయి.
చెన్నై ఇన్నింగ్స్ కు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ తనదైన శైలిలో ఫినిషింగ్ టచ్ ఇచ్చాడు. శామ్ కరన్ వేసిన ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్లో చివరి రెండు బంతులను స్టాండ్స్ లోకి పంపి అభిమానులను ఉర్రూతలూగించాడు. ఆ రెండు సిక్సులు కొట్టిన విధానం చూస్తే ధోనీ పవర్ ఏమాత్రం తగ్గలేదని అర్థమవుతుంది. ఈ మ్యాచ్ కోసం పసుపు దుస్తులు, పసుపు జెండాలతో వచ్చిన సూపర్ కింగ్స్ అభిమానులకు ఆఖర్లో ధోనీ కొట్టిన వరుస సిక్సులు పూనకాన్ని తెప్పించాయి. ధోనీ 4 బంతుల్లో 13 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు.
చెన్నై ఇన్నింగ్స్ లో ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ 37, శివమ్ దూబే 28, మొయిన్ అలీ 10, రవీంద్ర జడేజా 12 పరుగులు చేశారు. పంజాబ్ కింగ్స్ బౌలర్లలో అర్షదీప్ సింగ్ 1, శామ్ కరన్ 1, రాహుల్ చహర్ 1, సికిందర్ రజా 1 వికెట్ తీశారు.