Salman Khan: మహిళల శరీరాలు చాలా విలువైనవి.. వాటిని కవర్ చేయాల్సిందే: సల్మాన్ ఖాన్

Womens bodies are precious should be covered Says Salman
  • తన సెట్‌లో ‘లో నెక్‌లైన్’ నిబంధన పాటిస్తున్న సల్మాన్
  • మహిళలందరూ పూర్తిగా కవర్ చేసుకుని రావాల్సిందే
  • మరి ఆ పాటలో షర్ట్ లేకుండా ఎలా కనిపించారన్న ప్రశ్నకు సల్మాన్ సమాధానం
  • పురుషులు కూడా పూర్తిగా దుస్తులు లేకుండా కనిపించొద్దని సూచన
తన షూటింగ్ సెట్‌లో మహిళలందరూ శరీరాలు పూర్తిగా కప్పుకోవాలని, ‘లో నెక్‌లైన్’ నిబంధన పాటించాల్సిందేనన్న నిబంధనపై బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ స్పందించారు. ‘ఆప్‌ కీ అదాలత్’ టీవీ కార్యక్రమంలో పాల్గొన్న సల్మాన్‌ను ‘లో నెక్‌లైన్’ నిబంధనపై ప్రశ్నించగా.. మహిళల శరీరాలు చాలా విలువైనవని, కాబట్టి వారు తమ శరీరాన్ని పూర్తిగా కప్పుకోవాలని అన్నారు. ఇది మహిళలకు మాత్రమే కాదని, పురుషులు కూడా తమ శరీరాలను బహిరంగ పరచకూడదని అన్నారు. మహిళలు తమ శరీరాలను పూర్తిగా కప్పుకోకుంటే పురుషులు వారిని చూస్తారని, అది తనకు నచ్చదని అన్నారు. 

‘కిసీ కి భాయ్ కిసీ కీ జాన్’ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన శ్వేతా తివారీ కుమార్తె పలక్ తివారీ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తొలి సినిమాతో తనకు ఎదురైన అనుభవాన్ని పంచుకున్నారు. సల్మాన్ సెట్‌లో మహిళలు ధరించే అవుట్‌ఫిట్‌పై ప్రత్యేక నిబంధన ఉంటుందని వెల్లడించారు. అక్కడ ‘లో నెక్‌లైన్’ రూల్ ఉంటుందన్నారు.

‘ఆప్ కీ అదాలత్’ కార్యక్రమంలో పాల్గొన్న సల్మాన్‌‌పై హోస్ట్ మరో ప్రశ్న కూడా సంధించారు. ‘అమ్మాయిలు సరే.. మరి ‘ఒ ఓ జానే జానా’ పాటలో ఒంటిపై షర్టు లేకుండా కనిపించారు కదా’ అన్న ప్రశ్నకు సల్మాన్ స్పందిస్తూ.. ఆ పాటలో తాను స్విమ్మింగ్ ట్రంక్స్‌తో కనిపించానని, అప్పుడు పరిస్థితులు కూడా వేరని సల్మాన్ చెప్పుకొచ్చారు. కానీ ఇప్పుడు పరిస్థితులు భిన్నంగా ఉన్నాయని, మహిళలే కాదని, పురుషులు కూడా శరీరాన్ని పూర్తిగా కప్పుకోకుండా కనిపించవద్దని సూచించారు. మహిళలను పురుషులు చూసేందుకు అదే కారణమవుతోందన్నారు. ఇక్కడో విషయం గుర్తుపెట్టుకోవాలని, అక్కలు, చెల్లెళ్లు, భార్యలు, తల్లులు కూడా మనం అలా కనిపించడాన్ని ఇష్టపడరని సల్మాన్ అన్నారు.
Salman Khan
Bollywood
Low Neckline Rule
Palak Tiwari

More Telugu News