Lakshmi Parvathi: రజనీకాంత్ కు వార్నింగ్ ఇచ్చిన లక్ష్మీపార్వతి

Lakshmi Parvathi warns Rajinikanth

  • నిన్న విజయవాడలో ఎన్టీఆర్ శతజయంతి వేడుకల ప్రారంభ సభ
  • ముఖ్య అతిథిగా విచ్చేసిన రజనీకాంత్
  • ఎన్టీఆర్ ప్రసంగాల పుస్తకాల ఆవిష్కరణ
  • రజనీకాంత్ కూడా వెన్నుపోటుదారుడేనన్న లక్ష్మీపార్వతి
  • నాడు చంద్రబాబుకు మద్దతుగా నిలిచిన వారిలో రజనీ కూడా ఉన్నాడని వెల్లడి

దక్షిణాది సూపర్ స్టార్ రజనీకాంత్ నిన్న విజయవాడలో జరిగిన ఎన్టీఆర్ శతజయంతి వేడుకల ప్రారంభ సభలో చేసిన వ్యాఖ్యలపై వైసీపీ నేత, తెలుగు అకాడమీ చైర్ పర్సన్ లక్ష్మీపార్వతి మండిపడ్డారు. రజనీకాంత్ మరోసారి ఎన్టీఆర్ గురించి మాట్లాడితే ఊరుకోబోనని హెచ్చరించారు.

నాడు వెన్నుపోటు సమయంలో చంద్రబాబుకు మద్దతుగా నిలిచినవాళ్లలో రజనీకాంత్ కూడా ఉన్నారని లక్ష్మీపార్వతి వెల్లడించారు. తర్వాత కాలంలో ఎన్టీఆర్ ను కలిసిన రజనీకాంత్ తాను తప్పు చేశానని క్షమాపణ కోరారని ఆమె వివరించారు. అప్పట్లో వెన్నుపోటు వ్యవహారంలో రజనీకాంత్ ను తమిళ మీడియా కూడా విమర్శించిందని, దాంతో రజనీకాంత్ చాలాకాలం ఏపీ రాజకీయాలకు దూరంగా ఉన్నారని లక్ష్మీపార్వతి తెలిపారు. 

అయితే, చంద్రబాబు ఎంతో తెలివిగా మళ్లీ రజనీకాంత్ ను వాడుకుంటున్నారని, రజనీకాంత్ ద్వారా బీజేపీకి దగ్గరవ్వాలన్నది చంద్రబాబు ఎత్తుగడ అని ఆరోపించారు. సర్వేలన్నీ జగన్ కు అనుకూలంగా ఉండడంతో, చంద్రబాబు సినిమా వాళ్లతో నాటకాలు ఆడిస్తున్నారని విమర్శించారు. 

చంద్రబాబుతో కలిసిన రజనీకాంత్ కూడా వెన్నుపోటుదారుడేనని, అతడికి నిజాయతీ ఉంటే ఎన్టీఆర్ చివరి రోజుల్లో ఏం మాట్లాడారో తెలుసుకోవాలని స్పష్టం చేశారు. రజనీకాంత్ వ్యాఖ్యలకు విశ్వసనీయత ఉంటుందని తాను భావించడంలేదని అన్నారు.

అసలు, ఎన్టీఆర్ గురించి మాట్లాడడానికి చంద్రబాబు, రజనీకాంత్ ఎవరని ప్రశ్నించారు. ఎన్టీఆర్ పై పుస్తకాలు ఆవిష్కరించినంత మాత్రాన రజనీకాంత్ ను ఎవరూ నమ్మబోరని లక్ష్మీపార్వతి వ్యాఖ్యానించారు.

Lakshmi Parvathi
Rajinikanth
NTR
Chandrababu
NTR Centenary Celebrations
Vijayawada
  • Loading...

More Telugu News