jantar mantar: మహిళా రెజ్లర్లకు మద్దతు తెలిపిన ప్రియాంక గాంధీ
- శనివారం ఉదయం జంతర్ మంతర్ వెళ్లిన కాంగ్రెస్ నేత
- వెన్నంటి ఉంటామంటూ మహిళా రెజ్లర్లకు హామీ
- పతకాలు తెచ్చిన రెజ్లర్లు ఇలా రోడ్డుమీదకు రావడం బాధిస్తోందని వ్యాఖ్య
‘వారు దేశానికి పతకాలు తీసుకొచ్చినప్పుడు మనమంతా గర్వపడ్డాం కానీ ఇప్పుడు వాళ్లే న్యాయం చేయాలంటూ రోడ్డెక్కాల్సిన పరిస్థితి వచ్చింది’ అంటూ ప్రియాంక గాంధీ రెజ్లర్ల ఆందోళనపై విచారం వ్యక్తం చేశారు. శనివారం ఉదయం ఢిల్లీలోని జంతర్ మంతర్ కు వెళ్లిన ప్రియాంక గాంధీ.. అక్కడ ఆందోళన చేస్తున్న రెజ్లర్లను కలుసుకున్నారు. మహిళా రెజ్లర్లు సాక్షి మాలిక్, వినేశ్ ఫొగట్ లతో మాట్లాడారు. రెజ్లర్ల ఆందోళనకు మద్దతు తెలిపారు.
అనంతరం ప్రియాంక గాంధీ మీడియాతో మాట్లాడుతూ, దేశానికి పతకాలు తీసుకొచ్చి మనందరికీ గర్వకారణంగా నిలిచిన రెజ్లర్లు ఇలా రోడ్డు మీద ఆందోళన చేయాల్సి రావడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. ఇక్కడున్న మహిళా రెజ్లర్లు అందరూ ఈ స్థాయికి రావడానికి ఎన్నో కష్టాలను అనుభవించారని, ఎన్నో అవరోధాలను దాటుకుని వచ్చారని వివరించారు. లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా మహిళా రెజ్లర్లు గొంతెత్తడం అభినందనీయమని, దేశమంతా వారి వెన్నంటి నిలుస్తుందని పేర్కొన్నారు. బ్రిజ్ భూషణ్ సింగ్ పై రెండు కేసులు నమోదు చేశామన్న ఢిల్లీ పోలీసుల ప్రకటన నమ్మశక్యంగా లేదని, ఎఫ్ఐఆర్ లో ఏముందో ఎవరికీ తెలియదని ప్రియాంక గాంధీ చెప్పారు. ఢిల్లీ పోలీసులు ఎఫ్ఐఆర్ కాపీలను ఎందుకు బయటపెట్టడంలేదని ఆమె ప్రశ్నించారు.