India: మే నెలలో భారీగా పెరగనున్న ఉష్ణోగ్రతలు
- భారత వాతావరణ శాఖ అంచనా
- సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వెల్లడి
- ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపించొచ్చని హెచ్చరిక
భారత్‌లో వచ్చే నెలలో పలు ప్రాంతాల్లో భారీ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఫలితంగా, విద్యుత్ పంపిణీ వ్యవస్థలపై ఒత్తిడి పెరగడంతో పాటూ ఆర్థిక వ్యవస్థ నెమ్మదించి ప్రజల ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దెబ్బతినొచ్చని భావిస్తోంది.
మధ్య భారత్, తూర్పున ఉన్న ప్రాంతాల్లో సాధారణం కంటే అధికంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. ఈశాన్య రాష్ట్రాల్లోనూ ఉష్ణోగ్రతలు పెరగనున్నాయి. పశ్చిమ రాష్ట్రాల్లోనూ ఎండలు చుక్కలు చూపించనున్నాయి.
గతేడాది కూడా భారత్‌లో అసాధారణ స్థాయిలో ఉష్టోగ్రతలు నమోదయ్యాయి. ఫలితంగా, గోధుమల ఉత్పత్తిపై ప్రతికూల ప్రభావం చూపింది. ఈ నేపథ్యంలో కొత్త పెట్టుబడుల విషయంలో వ్యాపారులు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. అసాధారణ వాతావరణ పరిస్థితులు తలెత్తే సందర్భాల్లో ఏం చేయాలా? అనే దానిపై దృష్టి పెట్టారు.
భారత్‌తో పాటూ థాయ్‌లాండ్, బంగ్లాదేశ్‌లో ఎండలు మండిపోతున్నాయి. చైనాలోని యున్నన్ ప్రాంతంలో కరవు పరిస్థితులు నెలకొన్నాయి.