Nara Lokesh: వర్షం వస్తోంది ఆగుదాం అన్న నేతలు... వద్దంటూ ముందుకు కదిలిన లోకేశ్

Lokesh continued his Padayatra when it was raining

  • ఎమ్మిగనూరు నియోజకవర్గంలో ప్రవేశించిన లోకేశ్ పాదయాత్ర
  • ఇబ్రహీంపురం శివార్లలో ఘనస్వాగతం
  • మధ్యాహ్న భోజన విరామానంతరం కుండపోత వర్షం
  • ముందుకు కదిలిన లోకేశ్

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర 83వ రోజు (శుక్రవారం) ఎమ్మిగనూరు అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రవేశించింది. ఎమ్మిగనూరు ఇన్ చార్జి బీవీ జయనాగేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో వేలాదిమంది కార్యకర్తలు, అభిమానులు ఇబ్రహీంపురం శివార్లలో ఘనస్వాగతం పలికారు. మధ్యాహ్నం భోజన విరామానంతరం హోరు వర్షంలోనూ లోకేశ్ పాదయాత్ర కొనసాగించారు. 

పాదయాత్ర ఎమ్మిగనూరు నియోజకర్గం మాచాపురం శివార్లకు చేరుకోగానే కుండపోత వర్షం కురిసింది. గొడుగును సైతం తిరస్కరించి వర్షంలోనే యాత్రను కొనసాగించారు. కొద్దిసేపు ఆగాలన్న నాయకుల విజ్జప్తిని తిరస్కరించారు. దాంతో నాయకులు, కార్యకర్తలు వర్షంలోనే యువనేతను అనుసరించారు. లోకేశ్ తో పాటు యువగళం బృందాలు, వాలంటీర్లు, అభిమానులు తడిసి ముద్దయ్యారు. 

వర్షం కురుస్తున్నా లోకేశ్ ని చూసేందుకు మాచాపురం గ్రామంలో భారీగా ప్రజలు రోడ్లపైకి వచ్చారు. 83వరోజు యువనేత లోకేశ్ 14.2 కిలోమీటర్ల పాదయాత్ర చేశారు. ఇప్పటివరకు 1073.9 కిలోమీటర్ల పాదయాత్ర పూర్తిచేశారు.

ఆ స్టిక్కర్లు మీ ముఖాలకు వేసుకోండి జగన్ రెడ్డీ!

సీమప్రజలకు గుక్కెడు నీళ్లివ్వడం చేతగాని జగన్ రెడ్డి గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన పథకాలకు మాత్రం సిగ్గులేకుండా స్టిక్కర్లు, రంగులు వేసుకుంటున్నాడని లోకేశ్ తీవ్రస్థాయిలో దుయ్యబట్టారు. ఎమ్మిగనూరు నియోజకవర్గం ఇబ్రహీంపురంలో ప్రజలకు స్వచ్చమైన తాగునీరు అందించేందుకు ఎన్టీఆర్ సుజల స్రవంతి పథకం కింద గత ప్రభుత్వం మినరల్ వాటర్ ప్లాంట్ ను ఏర్పాటుచేసిందని వెల్లడించారు. 

ఈ పథకానికి నీరు అందించడం చేతగాక పాడుబెట్టిన వైసీపీ నేతలు జలగన్న స్టిక్కర్ మాత్రం వేసుకున్నారని మండిపడ్డారు. ఎవరికో పుట్టిన బిడ్డలను తమ బిడ్డలని చెప్పుకోవడం అలవాటుగా మారిన సైకో బ్యాచ్ ఖాళీ ఖజనాతో చేయగలిగింది ఏముంది? అంటూ ఎద్దేవా చేశారు. ఇంతకుమించి మేం పీకేదేం లేదని ఆ స్టిక్కర్లు మీ ముఖాలకు వేసుకుంటే ఇంకా బాగుంటుందని చురకలంటించారు.

యువగళంలో “విషనాగు”లకు విరుగుడు మందు!

మంత్రాలయం నియోజకవర్గం గుడికంబాల రీచ్ నుంచి రాష్ట్రేతర ప్రాంతాలకు తరలివెళ్తున్న ఇసుక లారీ విషనాగు ఇసుక దోపిడీకి ప్రత్యక్ష నిదర్శనం అని లోకేశ్ వ్యాఖ్యనించారు. మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి అలియాస్ విషనాగు అవినీతి ఆనవాళ్లు పాదయాత్రలో అడుగడుగునా కన్పిస్తున్నాయని అన్నారు. 

"అడ్డగోలుగా దోచుకొని అడ్డొచ్చిన వారిపై ఎదురుదాడి చేయండని వైసీపీ బూతుల స్కూలు ప్రిన్సిపాల్ జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్ లో ట్రైనింగ్ ఇచ్చి పంపాడు కాబోలు. నేను సాక్ష్యాధారాలతో బయటపెడుతున్న అక్రమాలపై సమాధానం చెప్పలేని వైసీపీ సైకోలు నాపై వ్యక్తిగత విమర్శలకు దిగడం దిగజారుడుతనానికి నిదర్శనం కాదా?! విషనాగులకు విరుగుడు మందు విచ్చలవిడి దోపిడీని ప్రజాక్షేత్రంలో ఎండగట్టడమే. ఆ మందే యువగళంలో ప్రజలు నాకిచ్చిన వరం" అని లోకేశ్ పేర్కొన్నారు.

అకాలవర్షాలతో నష్టపోయిన రైతులకు లోకేశ్ పరామర్శ

ఎమ్మిగనూరు నియోజకవర్గం ఇబ్రహీంపురంలో అకాల వర్షాలతో నష్టపోయిన మిర్చి రైతులను లోకేశ్ పరామర్శించారు. ఈ సందర్భంగా మిర్చి కళ్ళంలోకి వెళ్లి రైతులు భీమయ్య, నాగేంద్ర, రైతు కూలీలతో మాట్లాడారు. అకాల వర్షాలతో తీవ్రంగా నష్టపోయామని లోకేశ్ వద్ద మిర్చి రైతులు ఆవేదన వ్యక్తంచేశారు. కనీసం పంట నష్టం అంచనా వెయ్యడానికి కూడా ఎవరూ రాలేదని రైతులు వాపోయారు. 

అందుకు లోకేశ్ స్పందిస్తూ... పరదాల సీఎంకి రైతుల కష్టాలు కనపడవని విమర్శించారు. "అవినాష్ రెడ్డి జైలుకి పోకుండా కాపాడటంపై ఉన్న శ్రద్ధ రైతులపై లేదు. అకాల వర్షాల కారణంగా మిర్చి, మామిడి, వరి రైతులు తీవ్రంగా నష్టపోతే పరదాల సీఎం జగన్ కి కనీసం సమీక్ష చేసే తీరిక లేదు అని మండిపడ్డారు.

మహిళా రైతు కూలీల కష్టాలు విన్న లోకేశ్

ఎమ్మిగనూరు నియోజకవర్గం ఇబ్రహీంపురంలో మహిళా రైతు కూలీలతో మాట్లాడిన లోకేశ్... వారి సమస్యలను తెలుసుకున్నారు. రోజుకి రూ.250 కూలీ వస్తోందని,. పెరిగిన నిత్యావసర సరుకుల ధరలు, పన్నుల భారంతో బ్రతకడం కష్టంగా మారిందని మహిళా రైతు కూలీలు వాపోయారు. గ్రామంలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని, సాగు నీరు లేక వ్యవసాయ పనులు కూడా ఉండటం లేదని వెల్లడించారు. ఎంతోమంది గ్రామాన్ని వదిలి పనుల కోసం వలస పోతున్నారు అంటూ లోకేశ్ వద్ద మహిళా రైతు కూలీలు ఆవేదన వ్యక్తంచేశారు. 

అందుకు లోకేశ్ స్పందిస్తూ... టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే సాగు నీటి ప్రాజెక్టులు అన్ని పూర్తి చేసి స్థానికంగా వ్యవసాయ పనులు దొరికేలా చేస్తామని హామీ ఇచ్చారు. "తాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తాం. ప్రతి ఇంటికి తాగునీటి కుళాయి ద్వారా నీరు అందిస్తాం. వైసీపీ ప్రభుత్వం రద్దు చేసిన ఎన్టీఆర్ సుజల కార్యక్రమం తిరిగి ప్రారంభిస్తాం. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే నిత్యావసర సరుకుల ధరలు, పన్నుల భారం తగ్గిస్తాం" అని భరోసా ఇచ్చారు.

*యువగళం పాదయాత్ర వివరాలు:*

*ఇప్పటి వరకు నడిచిన దూరం 1073.9 కి.మీ.*

*ఈరోజు నడిచిన దూరం 14.2 కి.మీ.*

*84వ రోజు (29-4-2023) యువగళం వివరాలు:*

*ఎమ్మిగనూరు అసెంబ్లీ నియోజకవర్గం (కర్నూలు జిల్లా):*

సాయంత్రం

4.00 – నందవరం క్యాంప్ సైట్ నుంచి పాదయాత్ర ప్రారంభం.

4.15 – నందవరం జడ్ పిహెచ్ఎస్ స్కూలు వద్ద వడ్డెర సామాజికవర్గీయులతో భేటీ.

4.30 – నందవరం కల్వర్టు వద్ద కురుబ సామాజికవర్గీయులతో భేటీ.

4.40 – నందవరం రెయిన్ బో స్కూలు వద్ద దళితులతో సమావేశం.

5.00 – నందవరం ఆలయం వద్ద బీసీ సామాజికవర్గీయులతో సమావేశం.

5.10 – నందవరం ఎల్ఎల్ సి కెనాల్ వద్ద జగ్గాపురం గ్రామస్తులతో భేటీ.

5.30 – బాపురం గ్రామంలో బొప్పాయి రైతులతో సమావేశం.

6.20 – ముగటి గ్రామంలో పిలేకమ్మ దేవాలయం వద్ద ధర్మాపురం గ్రామస్తులతో భేటీ.

6.35 – ముగటి గ్రామంలో యువతతో సమావేశం.

6.45 – ముగటి సెంటర్ లో స్థానికులతో మాటామంతీ.

6.55 – చింతకాయల హోటల్ వద్ద ముగటి గ్రామస్తులతో సమావేశం.

7.05 – ముగటిలోని సొసైటీ బిల్డింగ్ వద్ద స్థానికులతో భేటీ.

7.25 – ముగటి రైస్ మిల్లు వద్ద రైస్ మిల్ అసోసియేషన్ ప్రతినిధులతో భేటీ.

8.15 – ఎమ్మిగనూరులోని ఈఎస్ వి వే బ్రిడ్జి వద్ద విడిది కేంద్రంలో బస.

*******






  • Loading...

More Telugu News