LSG: మొహాలీలో సిక్సులు, ఫోర్ల వర్షం... ఐపీఎల్ చరిత్రలోనే రెండో అత్యధిక స్కోరు నమోదు

LSG records 2nd highest score in IPL history

  • మొహాలీలో పంజాబ్ కింగ్స్ వర్సెస్ లక్నో సూపర్ జెయింట్స్
  • టాస్ గెలిచి లక్నోకు బ్యాటింగ్ అప్పగించిన పంజాబ్ కింగ్స్
  • 20 ఓవర్లలో 5 వికెట్లకు 257 పరుగులు చేసిన సూపర్ జెయింట్స్
  • వీరవిహారం చేసిన స్టొయినిస్, కైల్ మేయర్స్
  • బెంబేలెత్తించిన నికోలాస్ పూరన్, ఆయుష్ బదోనీ

ఐపీఎల్ 16వ సీజన్ లో మరో విధ్వంసక బ్యాటింగ్ ప్రదర్శన ఆవిష్కృతమైంది. మొహాలీలో ఇవాళ లక్నో సూపర్ జెయింట్స్ బ్యాటర్ల ధాటికి బౌండరీల వర్షం కురిసింది. పంజాబ్ కింగ్స్ తో మ్యాచ్ లో కొడితే సిక్స్, లేకపోతే ఫోర్ అన్నట్టుగా లక్నో ఆటగాళ్లు రెచ్చిపోయి బ్యాటింగ్ చేశారు. 

టాపార్డర్ విధ్వంసంతో లక్నో సూపర్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 257 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఐపీఎల్ చరిత్రలోనే ఇది రెండో అత్యధిక స్కోరు. 2013 సీజన్ లో ఆర్సీబీ జట్టు పుణే వారియర్స్ పై 5 వికెట్లకు 263 పరుగులు చేయగా, ఐపీఎల్ లో అదే హయ్యస్ట్ స్కోర్ గా రికార్డు పుటల్లోకెక్కింది. ఇప్పుడు ఆ తర్వాత స్థానంలో లక్నో జట్టు నిలిచింది. 

ఇవాళ్టి మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ టాస్ గెలిచి లక్నో సూపర్ జెయింట్స్ కు బ్యాటింగ్ అప్పగించింది. ఆ నిర్ణయం ఎంత తప్పో కాసేపటికే తెలిసి వచ్చింది. ఓపెనర్ కైల్ మేయర్స్ నుంచి మొదలుపెడితే ఆయుష్ బదోనీ, మార్కస్ స్టొయినిస్, నికోలాస్ పూరన్ బంతిని చీల్చిచెండాడారు. నువ్వు బంతిని విసురు... నేను కొట్టకపోతే ఒట్టు అన్నట్టుగా చితకబాదారు.

కైల్ మేయర్స్ 24 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్సులతో 54 పరుగులు చేసి లక్నో భారీ స్కోరుకు సరైన పునాది వేశాడు. ఆ తర్వాత ఆయుష్ బదోనీ, స్టొయినిస్ జోడీ స్కోరు బోర్డును పరుగులు పెట్టించింది. బదోనీ 24 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సులతో 43 పరుగులు సాధించాడు. ఇక స్టొయినిస్ టాప్ స్కోరర్ గా నిలిచాడు. తనదైన శైలిలో బంతిని బలంగా బాదిన స్టొయినిస్ 40 బంతుల్లోనే 72 పరుగులు చేశాడు. స్టొయినిస్ స్కోరులో 6 ఫోర్లు, 5 సిక్సులు ఉన్నాయి. 

మెరుపుదాడికి పెట్టింది పేరైన నికొలాస్ పూరన్ వచ్చీరావడంతోనే బంతిపై బలప్రయోగం చేశాడు. పూరన్ కేవలం 19 బంతులాడి 7 ఫోర్లు, 1 సిక్స్ తో 45 పరుగులు చేశాడు. పంజాబ్ కింగ్స్ బౌలర్లలో కగిసో రబాడా 2, అర్షదీప్ సింగ్ 1, శామ్ కరన్ 1, లియామ్ లివింగ్ స్టోన్ 1 వికెట్ తీశారు.

More Telugu News