Ambati Rambabu: ఎన్టీఆర్ శతజయంతి వేడుకలకు రజనీకాంత్... స్పందించిన మంత్రి అంబటి
- విజయవాడ పోరంకిలో నేడు ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు
- రాష్ట్రానికి వచ్చిన సూపర్ స్టార్ రజనీకాంత్
- ఎన్టీఆర్ పై అభిమానంతో వచ్చుంటారన్న అంబటి రాంబాబు
- ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు జరిపే హక్కు చంద్రబాబుకు లేదని వ్యాఖ్యలు
విజయవాడ పోరంకిలో టీడీపీ నిర్వహిస్తున్న ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలకు హాజరయ్యేందుకు దక్షిణాది సినీ సూపర్ స్టార్ రజనీకాంత్ ఏపీకి వచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై ఏపీ మంత్రి అంబటి రాంబాబు స్పందించారు.
"భారతదేశంలో ఎంతో ప్రముఖుడైన నటుడు రజనీకాంత్ గారు ఇవాళ విజయవాడ వచ్చారు. గతంలో ఎన్టీఆర్ చేసిన ప్రసంగాలను, ఆయనపై వచ్చిన పుస్తకాలను రజనీకాంత్ ఈ శతజయంతి కార్యక్రమంలో ఆవిష్కరిస్తారని నేను విన్నాను. రజనీకాంత్ రాజకీయాలకు అతీతంగా, ఎన్టీఆర్ పై ఉన్న గౌరవంతోనే ఈ కార్యక్రమానికి వచ్చారని భావిస్తున్నాను. లేకపోతే, ఎన్టీఆర్ తో కలిసి నటించానన్న భావనతోనో రజనీకాంత్ ఈ కార్యక్రమానికి వచ్చినట్టు అనుకుంటున్నాం. లేక, సహనటుడు బాలకృష్ణతో ఉన్న సంబంధాల వలన ఆయన ఇక్కడికి వచ్చి ఎన్టీఆర్ కు నివాళులు అర్పిస్తారని భావిస్తున్నాం.
ఎన్టీఆర్ వంటి వ్యక్తికి శతజయంతి ఉత్సవాలు జరపడం తెలుగువారందరికీ హర్షణీయమైన విషయమే. అయితే ఇక్కడ విషయం ఏమిటంటే... ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు జరిపే హక్కు చంద్రబాబునాయుడుకు మాత్రం లేదు. ఈ విషయాన్ని నేను చాలా స్పష్టంగా చెప్పదలచుకున్నాను" అని అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు.