- సొంత మైదానంలో గొప్పగా ఆడారంటూ కితాబు
- తమ జట్టుకు కలసి రాలేదన్న ఫ్లెమింగ్
- ఎక్కువ పరుగులు సమర్పించుకున్నట్టు అంగీకారం
ప్రత్యర్థి ఆటను మెచ్చుకోవాలంటే మంచి మనసు ఉండాలి. చెన్నై జట్టు చీఫ్ కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ అదే చేశారు. గురువారం చెన్నై జట్టును రాజస్థాన్ జట్టు చిత్తుగా ఓడించింది. తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ జట్టు చెలరేగి ఆడి 202 స్కోరు సాధించగా, చెన్నై జట్టు పోరాటం 170 పరుగుల వద్దే ఆగిపోయింది. మ్యాచ్ అనంతరం స్టీఫెన్ ఫ్లెమింగ్ మీడియాతో తన అభిప్రాయాలను పంచుకున్నారు.
‘‘ఆర్ఆర్ తన సొంత మైదానంలో గొప్పగా ఆడింది. యశస్వి జైస్వాల్ కూడా అద్భుతంగా ఆడాడు’’అని ఫ్లెమింగ్ మెచ్చుకున్నారు. తమ జట్టుకు కొంత దురదృష్టం తోడైదంటూ, 16-20 ఎక్కువ పరుగులు సమర్పించుకున్నట్టు చెప్పారు. మహా అయితే 185 పరుగుల వద్ద రాజస్థాన్ జట్టును కట్టడి చేసి ఉండాల్సిందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
‘‘ఇదొక మంచి గేమ్. రాజస్థాన్ రాయల్స్ అద్భుతంగా ఆడింది. పిచ్ ఎలాంటి ఫలితాన్నిస్తుందన్న దానిపై ముందే పెద్ద అంచనాలు వేసుకోవడం ఇష్టం ఉండదు. అంతకుముందుతో పోలిస్తే పిచ్ భిన్నంగా కనిపించింది. ఆట ముగింపులో వికెట్ నిదానించింది. ఆటలో మేము (చెన్నై) మంచిగానే పుంజుకున్నాం. కానీ మూడు నాలుగు ఓవర్లలో మాకు కలసి రాలేదు’’అని చెప్పారు. రాజస్థాన్ జట్టు బ్యాటింగ్, బౌలింగ్ లో రాణించారని కొనియాడారు.