- మెట్రోల్లో జీవనం ఖరీదుగా మారిందన్న ట్విట్టర్ యూజర్
- ఫ్రెషర్లు అంత తక్కువ జీతాలతో ఎలా బతికేది? అంటూ ప్రశ్న
- మన ఎంపికలే ఖర్చులను నిర్ణయిస్తాయంటూ నెటిజన్ల బదులు
నేడు దేశ ప్రజల సగటు ఆదాయం పెరిగింది. కానీ, తరచి చూస్తే జీవన వ్యయం అంతకంటే ఎక్కువే పెరిగిందని అర్థమవుతుంది. ఎంత సంపాదించినా మిగిలేది ఏమీ లేక, భారీ ఖర్చులతో సగటు మధ్య తరగతి కుటుంబీకులు సతమతం అవుతున్నారు. ఈ తరుణంలో నెట్టింట మేధా గంటి అనే యువతి పెట్టిన పోస్ట్ ఆసక్తికర చర్చకు తావిచ్చింది. రూ.50వేలు సంపాదిస్తే కానీ మెట్రోల్లో బతికే పరిస్థితి లేదు. అలాంటప్పుడు ఫ్రెషర్లకు ఈ జీతాలేంటి? అంటూ ఆమె ప్రశ్న సంధించింది.
‘‘ఫ్రెషర్లకు అంత తక్కువ జీతాలు ఎందుకని? మెట్రోల్లో ఎవరైనా ఆ మాత్రం వేతనంతో ఎలా బతకాలి? నెలకు రూ.50వేలు సంపాదించినా పొదుపు చేయడం కష్టంగా ఉంది. ప్రతి ఒక్కరూ తమ కుటుంబం నుంచి డబ్బులు తెచ్చుకోలేరు’’అంటూ మేధా ట్వీట్ చేసింది. దీనికి యూజర్లు కూడా ఉత్సాహంగా స్పందించారు.
‘‘జీవన వ్యయం అన్నది జీతాలను నిర్ణయించదు. డిమాండ్, సరఫరా పరిస్థితులే నిర్ణయిస్తాయి. దీనికితోడు పరిష్కార సామర్థ్యాలు వేతనంలో పాత్ర పోషిస్తాయి’’అని కౌస్తభ్ కాలే అనే వ్యక్తి రిప్లయ్ ఇచ్చాడు. అవును ఎక్కడో ఒక చోట బ్యాలన్స్ అవసరమే అన్నది మరో యూజర్ అభిప్రాయం. తేజాస్ శేఖర్ అనే వ్యక్తి స్పందిస్తూ.. ‘‘మన జీవన విధానంపైనే ఇది ఆధారపడి ఉంటుంది. రూ.50వేల కంటే తక్కువ నెల జీతం ఉన్నవారు నాకు తెలుసు. అయినా కానీ, వారు నెలకు రూ.8-10వేల వరకు పొదుపు చేస్తున్నారు. రూ.50వేలు మించిన జీవన వ్యయాలు కలిగిన వారు కూడా తెలుసు. మనం ఎంపిక చేసుకునే జీవన విధానంపైనే ఖర్చులు ఆధారపడి ఉంటాయి’’అని వివరించాడు.
దీనికి మేధా గంటి స్పందిస్తూ.. ‘‘అద్దె కూడా ఎంతో ఖరీదుగా ఉంది. లేదంటే మీరు ఎక్కడ నివసించాలనే విషయంలోనూ ఎంతో రాజీపడాల్సిందే’’అని పేర్కొంది. పెరిగిపోయిన జీవన వ్యయాలు, అదే సమయంలో జీవనంలో భాగంగా మన ఎంపికలు అనే అంశాలను ఈ చర్చ ఎత్తి చూపించింది.