- ఓ అభయారణ్యంలో ఘటనను షేర్ చేసిన ఐఎఫ్ఎస్ అధికారి నందా
- ఏనుగును మచ్చిక చేసుకున్నా ఆటలాడొద్దంటూ సూచన
- ఏనుగు అత్యంత తెలివైన జంతువుగా అభివర్ణణ
ఏనుగుతో పరాచికాలు ఆడితే ఏమవుతుంది..? ప్రాణం పోయినా ఆశ్చర్యపోనవసరం లేదు. బలంలో ఏనుగుకు మరే జంతువు సాటి రాదు. ముఖ్యంగా అటవీ జంతువుల దగ్గర చాలా జాగ్రత్తగా మసులుకోవాల్సిన అవసరాన్ని తెలియజేస్తూ ప్రముఖ ఐఎఫ్ఎస్ అధికారి సుశాంత నందా ఓ వీడియోని తన ట్విట్టర్ పేజీలో షేర్ చేశారు.
ఈ వీడియోని గమనిస్తే అందులో ఓ మహిళ తన కుడి చేత్తో అరటి గెల పట్టుకుంది. ఎడమ చేత్తో ఓ పండును తీసుకుని ఏనుగుకు ఇచ్చే ప్రయత్నం చేసింది. కానీ, భయంతో ధైర్యంగా తొండానికి అందివ్వలేకపోయింది. ఏనుగు పండు కోసం ముందుకు రావడంతో మహిళ భయంతో ఒక అడుగు వెనక్కి వేసింది. అలా పండు ఇవ్వకుండా తన చేత్తోనే పట్టుకుని ఉండిపోయింది. దీంతో ఏనుగుకు మండింది. తొండంతో బలంగా ఆ మహిళను విసిరికొట్టింది. ఈ వీడియో మన దేశానికి చెందినది కాదు.
‘‘ఏనుగును మచ్చిక చేసుకున్నా సరే దాన్ని వెర్రిదానిని చేయొద్దు. బందీగా ఉండే అత్యంత తెలివైన జంతువులలో ఏనుగు కూడా ఒకటి’’అని ఐఎఫ్ఎస్ అధికారి ఈ వీడియోతోపాటు ట్వీట్ చేశారు. ఆమె బతికే ఉందా? అంటూ యూజర్ల నుంచి సందేహం వ్యక్తమైంది. ఆమె ప్రాణాలతో బయటపడి ఉంటుందన్న ఆశాభావాన్ని మరో యూజర్ వ్యక్తం చేశారు.