Sudan: సూడాన్‌లో భారతీయులకు దారుణ అనుభవాలు

Indians rescued from sudan share their traumatic experience with media

  • తమ అనుభవాలను మీడియాతో పంచుకున్న భారతీయులు
  • బాంబు దాడులు, దారి దోపిడీలతో కంటిమీద కునుకులేకుండా గడిపిన వైనం
  • ఎప్పుడు ఏం జరుగుతుందో తెలీక బిక్కుబిక్కు మంటూ గడిపామని వెల్లడి
  • కట్టుబట్టలతో సూడాన్‌ను వీడామని చెప్పిన ఇండియన్స్

సూడాన్ నుంచి సురక్షితంగా బయటపడ్డ భారతీయులు అక్కడ తమకు ఎదురైన అనుభవాలను మీడియాతో పంచుకున్నారు. సూడాన్‌లో దారుణ పరిస్థితులు నెలకొన్నాయని చెప్పారు. కట్టుబట్టలతో దేశాన్ని వీడామని, మళ్లీ ఆ దేశానికి వెళ్లే ప్రసక్తే లేదని కూడా తేల్చి చెప్పారు. ఇరుగు పొరుగు ఇళ్లపై బాంబు దాడులు, గాల్లో మిసైళ్లు ఎగురుతున్న దృశ్యాలు, గన్నుతో బెదిరిస్తూ అమాయకులను దోపిడీ చేస్తున్న ఘటనలను ప్రత్యక్షంగా చూశామని చెప్పుకొచ్చారు. ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని సూడాన్ నుంచి బయటపడ్డామన్నారు. 

సూడాన్ నుంచి సురక్షితంగా భారత్‌‌కు చేరుకున్న జ్యోతి అగర్వాల్ తన అనుభవాలను ఇలా చెప్పుకొచ్చారు. ‘‘నా భర్త రాజధాని ఖార్తూమ్‌లో ఛార్టెడ్ అకౌంటెంట్‌గా పనిచేశారు. ఇక ఘర్షణలు ప్రారంభమయ్యాక నేను, భర్త కట్టుబట్టలతో సూడాన్‌ను వీడాము. నా ఇద్దరు పిల్లల కోసం రెండు జతల దుస్తులు మాత్రమే వెంట తెచ్చుకున్నాం. మా ఇంటికి కూతవేటు దూరంలో ఉన్న ఓ ఇల్లు బాంబు దాడిలో నేలమట్టం కావడం ప్రత్యక్షంగా చూశాను. ఏ క్షణంలో ఏం జరుగుతుందో తెలీక తీవ్ర భయాందోళనలకు గురయ్యా. మేమందరం ఒక్కసారిగా చనిపోతామా లేక మాలో కొందరు మాత్రమే మరణిస్తారా అన్న సందేహం కూడా కలిగింది. మా వద్ద డబ్బులు ఉంటే దోపిడీ లేదా హత్య చేస్తారనే ఉద్దేశంతో మా వెంట ఎటువంటి డబ్బు తెచ్చుకోలేదు’’ అని ఆమె చెప్పుకొచ్చారు. 

సూడాన్‌లోని భారతీయులందరూ దాదాపుగా తమకు ఇవే అనుభవాలు ఎదురైనట్టు చెప్పుకొచ్చారు. అక్కడ సుమారు 4 వేల మంది భారతీయులు ఉంటారని ఒక అంచనా. వీరిని సురక్షితంగా తరలించేందుకు కేంద్రం ‘ఆపరేషన్ కావేరి’ ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఇప్పటివరకూ 1100 మంది భారతీయులను కేంద్రం తరలించింది.

  • Loading...

More Telugu News