Andhra Pradesh: జగనన్న వసతి దీవెన నిధులు విడుదల చేసిన ఏపీ ముఖ్యమంత్రి

Jagan speech from ananthapuram district

  • వ్యక్తి జీవితాన్ని మార్చే శక్తి చదువుకు ఉందని నమ్మే ప్రభుత్వం తమదన్న జగన్ 
  • పేదరికపు సంకెళ్లను తెంచుకునేందుకు ఉన్న ఒకే ఒక అస్త్రం చదువని వ్యాఖ్య 
  • కులాల చరిత్రను, సామాజిక వర్గాలను మార్చేయగల సాధనం చదువొక్కటేనన్న సీఎం 

ఆంధ్రప్రదేశ్ లో భావితరాలను ప్రపంచంతో పోటీపడేలా తీర్చిదిద్దే గొప్ప ఉద్దేశంతో జగనన్న వసతి దీవెన పథకం ప్రారంభించామని ముఖ్యమంత్రి జగన్ పేర్కొన్నారు. అనంతపురం జిల్లాలో బుధవారం జరిగిన కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. చదువుకున్న శక్తి గురించి తాను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదని అన్నారు. కులాల చరిత్రను, కుటుంబాల పరిస్థితిని మార్చే శక్తి చదువుకు మాత్రమే ఉందని అన్నారు. పేదరికం సంకెళ్లను తెంచేసే అస్త్రం చదువొక్కటేనని ఆయన స్పష్టం చేశారు. చదువు విలువ తెలిసిన ప్రభుత్వంగా ఈ నాలుగేళ్లు రాష్ట్రంలో విద్యార్థులకు అండగా నిలబడుతూ వస్తున్నామని వివరించారు.

పిల్లల చదువుల కారణంగా రాష్ట్రంలో ఏ ఒక్క కుటుంబం కూడా అప్పులపాలు కాకూడదనే సదుద్దేశంతో జగనన్న వసతి దీవెన పథకం తీసుకొచ్చామని జగన్ వివరించారు. రాష్ట్రంలోని విద్యార్థులు ఉన్నత చదువులకు దూరం కాకూడదని అనేక పథకాలు అమలు చేస్తున్నామని, జగనన్న వసతి దీవెన కూడా అందులో ఒకటని తెలిపారు. ఈ పథకం కింద ఉన్నత చదువులు చదువుతున్న విద్యార్థుల తల్లుల ఖాతాలో నేరుగా డబ్బు జమ చేస్తున్నట్లు జగన్ పేర్కొన్నారు. ఐటీఐ చదువుతున్న విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.10 వేలు, పాలిటెక్నిక్ విద్యార్థులకు రూ. 15 వేలు, డిగ్రీ, ఇంజనీరింగ్, మెడిసిన్ విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.20 వేలు జమ చేస్తున్నామని చెప్పారు.

ఆంధ్రప్రదేశ్ లోని 9,55,662 మంది విద్యార్థుల తల్లుల బ్యాంకు ఖాతాల్లో రూ.912.71 కోట్లు ఈ రోజు (బుధవారం) జమ చేయనున్నట్లు ముఖ్యమంత్రి జగన్ తెలిపారు. ఈ కార్యక్రమం ముగిసిన తర్వాత బటన్ నొక్కి నిధులను నేరుగా విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ చేస్తామని వివరించారు. ప్రతి ఊరిలో, ప్రతి జిల్లాలో నాణ్యమైన విద్య అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చేలా చర్యలు తీసుకుంటున్నామని జగన్ తెలిపారు. తమ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల డ్రాపౌట్స్ సంఖ్య గణనీయంగా తగ్గిపోయిందని వివరించారు.

చంద్రబాబుపై విమర్శలు..
వచ్చీరాని ఇంగ్లిష్ లో రిపబ్లిక్ టీవీకి ఓ ముసలాయన ఇంటర్వ్యూ ఇచ్చారని ముఖ్యమంత్రి జగన్ పరోక్షంగా చంద్రబాబును విమర్శించారు. ఆయన మాటలు వింటుంటే తనకు పంచతంత్రం కథ గుర్తుకొచ్చిందని చెప్పారు. నరమాంసం రుచి మరిగిన పులి వృద్ధాప్యంలో మాంసం తినడం మానేశానని అబద్ధాలు చెబుతూ మనుషులను నమ్మించాలని ప్రయత్నిస్తోందని చెప్పారు. నాలుగు నక్కలను వెంటేసుకుని, నలభై ఏళ్ల ఇండస్ట్రీ (అనుభవం) ఉందంటూ అడవిలో బాటసారులను నమ్మించే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు.

అబద్ధాలు చెప్పే వారిని, మారిపోయామని చెప్పే మోసగాళ్లను, వెన్నుపోటు పొడిచే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మొద్దని పంచతంత్రం కథలోని నీతిని గుర్తించాలని జగన్ వివరించారు. ఈ కథ వింటే నారా చంద్రబాబే గుర్తుకొస్తాడని జగన్ తెలిపారు. ఇటీవల ఓ సభలో చంద్రబాబు మరోమారు ‘జాబు కావాలంటే బాబు రావాలి’ అని చెప్పాడు. ఆయన మాటలు వింటుంటే.. ఈయనకు ఈ జన్మలో బుద్ధి రాదని తనకు అనిపించిందని జగన్ చెప్పారు.

Andhra Pradesh
YSRCP
YS Jagan
Jagananna Vasathi Deevena
  • Loading...

More Telugu News