kenya cult: కెన్యాలో 90కి చేరిన ఉపవాస మరణాలు
- పాస్టర్ బోధనలతో కఠిన ఉపవాసం చేసి ప్రాణాలు తీసుకున్న జనం
- పాస్టర్ సొంత స్థలంలో తవ్వేకొద్దీ బయటపడుతున్న మృతదేహాలు
- ఫ్రీజర్లు లేక మంగళవారంతో తవ్వకాలు ఆపేసిన అధికారులు
కెన్యాలోని షాకహోలాలో తవ్వేకొద్దీ మృతదేహాలు బయటపడుతూనే ఉన్నాయి. మంగళవారం నాటికి బయటపడ్డ మృతదేహాల సంఖ్య 90 కి చేరింది. డెడ్ బాడీలను పోస్టుమార్టం కోసం భద్రపరిచేందుకు స్థలం లేకపోవడంతో తవ్వకాలను అధికారులు తాత్కాలికంగా ఆపేశారు. చనిపోయిన వారిలో చిన్నపిల్లల సంఖ్యే ఎక్కువగా ఉందని అధికారులు తెలిపారు. మరికొంతమంది అడవుల్లో దాక్కుని ఉండొచ్చనే అనుమానంతో గాలింపు చర్యలు చేపట్టినట్లు వివరించారు. ఇంత దారుణమైన సంఘటన గతంలో ఎన్నడూ చూడలేదని అధికారులు చెబుతున్నారు.
షాకహోలాలో పాస్టర్ మెకంజీ కారణంగా పెద్ద సంఖ్యలో జనం చనిపోయారు. కఠిన ఉపవాసంతో చనిపోతే జీసస్ ను కలుసుకుంటారని చెప్పడంతో పాస్టర్ మెకంజీ ఫాలోవర్లు తిండి, నీరు ముట్టకుండా ఉపవాసం చేసి బలవన్మరణానికి పాల్పడ్డారు. ఇలా చనిపోయిన వారిని షాకహోలా అటవీ ప్రాంతంలోని తన స్థలంలో పాస్టర్ మెకంజీ పాతిపెట్టారని అధికారులు ఆరోపిస్తున్నారు. మెకంజీకి చెందిన స్థలంలో తవ్వకాలు చేపట్టగా మంగళవారం నాటికి 90 మృతదేహాలు బయటపడ్డాయని వివరించారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ ఘటనను కెన్యా పోలీసులు షాకహోలా ఫారెస్ట్ మాస్కరేగా వ్యవహరిస్తున్నారు.
ఈ ఘటనపై స్పందించిన కెన్యా ప్రభుత్వం.. దేశవ్యాప్తంగా ఉన్న చర్చిలలో తనిఖీలు నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఇలాంటి దారుణాలకు కారణమయ్యే వారిని వదిలిపెట్టబోమని కెన్యా అంతర్గత వ్యవహారాల శాఖ మంత్రి కిథురె కిండికి మీడియాకు తెలిపారు. షాకహోలాలో మరణాలకు కారణమైన పాస్టర్ మెకంజీపై టెర్రర్ కేసు నమోదు చేస్తామని చెప్పారు. తమ అనుచరులను ఉపవాసం చేయాలని చెబుతూ.. బోధకులు మాత్రం తింటూ తాగుతూ ఎంజాయ్ చేస్తున్నారని మంత్రి మండిపడ్డారు.