USA: టెక్సాస్‌లో దారుణం.. నాలుకలు తెగ్గోసి, దవడలు ముక్కలు చేసి.. ఆరు ఆవులను చంపేసిన దుండగులు!

 6 cows found dead in Texas and probe underway
  • టెక్సాస్‌లో పలు కౌంటీల్లో రోడ్డు పక్కన కనిపించిన గోవులు
  • గోవుల నాలుకలను జాగ్రత్తగా, చాలా కచ్చితంగా తెగ్గోసిన దుండగులు
  • రెండు ఆవుల బాహ్య జననేంద్రియాల తొలగింపు
  • ఎవరు, ఎందుకు చేశారన్న దానిపై లభించని స్పష్టత
  • కొనసాగుతున్న దర్యాప్తు
అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో అమానవీయ ఘటన జరిగింది. నాలుకలు పూర్తిగా తెగ్గోసి, దవడలు విరిచేసి మరణించిన ఆరు గోవులు రహదారి పక్కన చనిపోయి కనిపించాయి. అయితే, గోవులు పడివున్న చోట ఎలాంటి రక్తపు మరకలు లేకపోవడం గమనార్హం. ఈ ఘాతుకానికి ఎవరు ఒడిగట్టి ఉంటారన్న దానిపై అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. 

మాడిసన్ కౌంటీలో రహదారి వెంట పడివున్న ఓ గోవును తొలుత కాపరులు గుర్తించినట్టు పోలీసులు ఫేస్‌బుక్ ద్వారా తెలిపారు. ఆ తర్వాత ఇలాంటి ఘటనలే రాష్ట్రంలోని పలుచోట్ల వెలుగుచూశాయి. దీంతో స్పందించిన పోలీసులు దర్యాప్తు సంస్థలతో కలిసి రంగంలోకి దిగారు. 

సర్జికల్ బ్లేడుతో చాలా కచ్చితంగా ఆవుల నాలుకలను కోశారని, ఎలాంటి రక్తపు మరకలు చిందలేదని పోలీసు కార్యాలయం తెలిపింది. అలాగే గోవు నోటికి ఉన్న తోలును ఒకవైపు జాగ్రత్తగా వలిచేసినట్టు పేర్కొంది. అయితే, ఈ ఘటన జరిగినప్పుడు ఆవులు ఎలాంటి బాధకు గురైనట్టు కనిపించడం లేదని అన్నారు. ఆవులు పడివున్న చోట చుట్టుపక్కల ఉన్న గడ్డిని అవి మేసినట్టు కానీ, వాహనాల్లో వాటిని అక్కడికి తరలించినట్టుగా ఎలాంటి టైరు మార్కులు కానీ అక్కడ కనిపించలేదని వివరించారు.

గోవులన్నీ ఇలాంటి స్థితిలోనే కనిపించినట్టు చెప్పారు. ఇవన్నీ వేర్వేరు మందలకు చెందినవని, వేర్వేరు ప్రాంతాల్లో ఇవి కనిపించాయని అన్నారు. బ్రాజోస్, రాబర్డ్‌సన్ కౌంటీల్లో స్టేట్ హైవే పక్కన ఈ గోవులు కనిపించినట్టు చెప్పారు. రెండు ఆవుల బాహ్య జననేంద్రియాలను తొలగించినట్టు తెలిపారు. 

ఆవుల కళేబరాలను తినేందుకు జంతువులు కానీ, పక్షులు కానీ రాలేదని కాపరులు తెలిపారు. చాలా రోజులుగా అవి అలాగే పడి ఉండడంతో కుళ్లిపోయినట్టు పేర్కొన్నారు. అయితే, వాటి మరణానికి గల కారణాలు మాత్రం తెలియరాలేదు. ఈ ఘటనలపై దర్యాప్తు చేస్తున్నామని, త్వరలోనే అన్ని వివరాలు బయటకు వస్తాయని పోలీసులు తెలిపారు.
USA
Texas
Cows
Cows Found Dead

More Telugu News