SRH: మనోళ్లు గెలుస్తారనుకుంటే... వాళ్లు గెలిచారు!
- ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్
- 7 పరుగుల తేడాతో నెగ్గిన ఢిల్లీ క్యాపిటల్స్
- 145 పరుగుల లక్ష్యఛేదనలో 137 పరుగులే చేసిన సన్ రైజర్స్
- చివరి ఓవర్లో 13 రన్స్ కొట్టలేకపోయిన సుందర్, జాన్సెన్
హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ 7 పరుగుల తేడాతో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టును ఓడించింది. ఈ మ్యాచ్ లో రెండు జట్లు ఆడిన తీరు చూస్తే దొందూ దొందే అన్నట్టుగా సాగింది.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఢిల్లీ క్యాపిటల్స్ చచ్చీచెడీ 20 ఓవర్లలో 9 వికెట్లకు 144 పరుగులు చేసింది. సొంతగడ్డపై ఆడుతూ కూడా ఆ స్కోరును ఛేదించలేక సన్ రైజర్స్ చతికిలపడింది. 145 పరుగుల లక్ష్యఛేదనలో సన్ రైజర్స్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 137 పరుగులే చేసి ఓటమిపాలైంది.
ఆఖరి ఓవర్లో సన్ రైజర్స్ విజయానికి 6 బంతుల్లో 13 పరుగులు అవసరం కాగా... ముఖేశ్ సింగ్ ఆ ఓవర్ బౌలింగ్ చేశాడు. కచ్చితమైన యార్కర్లతో సన్ రైజర్స్ బ్యాటర్లకు కళ్లెం వేశాడు. వాషింగ్టన్ సుందర్, మార్కో జాన్సెన్ క్రీజులో ఉన్నప్పటికీ ఆ ఓవర్లో కేవలం 5 పరుగులే వచ్చాయి.
సన్ రైజర్స్ ఇన్నింగ్స్ లో ఓపెనర్ మయాంక్ అగర్వాల్ 49 పరుగులు చేశాడు. కాస్ట్ లీ ప్లేయర్ హ్యారీ బ్రూక్ (7) మళ్లీ విఫలం కావడంతో సన్ రైజర్స్ యాజమాన్యానికి మింగుడుపడని విషయం. కెప్టెన్ మార్ క్రమ్ (3), అభిషేక్ శర్మ (5) స్వల్ప స్కోర్లకే వెనుదిరగడం ఛేజింగ్ పై ప్రభావం చూపింది.
వికెట్ కీపర్ హెన్రిచ్ క్లాసెన్ 31 పరుగులు చేయగా, వాషింగ్టన్ సుందర్ 24 పరుగులో నాటౌట్ గా నిలిచాడు. ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లలో ఆన్రిచ్ నోర్కియా 2, అక్షర్ పటేల్ 2, ఇషాంత్ శర్మ 1, కుల్దీప్ యాదవ్ 1 వికెట్ తీశారు.