Scotland: అమ్మకానికో ఐల్యాండ్.. రూ.1.5 కోట్లే.. కొంటారా?
- స్కాట్లాండ్ లో బర్లొకో అనే దీవి అమ్మకానికి పెట్టిన ‘గాల్‌బ్రైత్ గ్రూప్’
- 1.9 లక్షల డాలర్లకు అమ్మనున్నట్లు వెల్లడి
- 25 ఎకరాల విస్తీర్ణంలో అద్భుతంగా ఉన్న ఐల్యాండ్
ఓ ఐల్యాండ్ అమ్మకానికి వచ్చిందండోయ్! పెద్ద ధర కూడా కాదు. కేవలం రూ.1.5 కోట్లే. కాకపోతే మన దగ్గర కాదు.. స్కాట్లాండ్ లో! ‘బర్లొకో’ అనే దీవిని ‘ఫర్ సేల్’ కోసం ఉంచినట్లు అంతర్జాతీయ వార్తా సంస్థ సీఎన్ఎన్ రిపోర్ట్ చేసింది.
ద్వీపాన్ని అమ్మేందుకు సంబంధించిన విషయాలను గాల్‌బ్రైత్ గ్రూప్ చూసుకుంటోంది. ‘‘స్కాటిష్ ప్రైవేట్ ద్వీపాన్ని సొంతం చేసుకోవడంలో ఇప్పటికీ చాలా మందికి ఓ రొమాంటిక్ సెంటిమెంట్ ఉంది. మీరు రోజువారి జీవితం నుంచి బయటికొచ్చి కాస్త రిలీఫ్ పొందొచ్చు. చుట్టూ ఉన్న అత్యంత అందమైన దృశ్యాలతో కొంత శాంతి, ప్రశాంతతను ఆస్వాదించవచ్చు’’ అని గాల్‌బ్రైత్ గ్రూప్‌కు చెందిన ఆరోన్ ఎడ్గర్ చెప్పారు.
ఈ ద్వీపంలో ఎలాంటి జనావాసాలు లేవు. ఒక చెరువు ఉంది. నీటిని సరఫరాకు ఢోకా లేదు. దగ్గర్లోనే ఓ బీచ్ కూడా ఉంది. కాలినడకన చేరుకోవచ్చు. అలల ఆటుపోట్లు తక్కువగా ఉంటాయట. పడవలు, బోట్లను లంగరు వేయవచ్చు. ద్వీపానికి ఆరు మైళ్ల దూరంలోనే ఓ పట్టణం ఉంది. గంటలో రైలు స్టేషన్‌కు చేరుకోవచ్చు. లండన్ 350 మైళ్లు, ఎడిన్బర్గ్ 100 మైళ్ల దూరంలో ఉన్నాయి.
ఈ ఐల్యాండ్ అంత పెద్దదేమీ కాదు. ఓ 25 ఎకరాల విస్తీర్ణం ఉంటుంది. సముద్రం దాకా పచ్చని గడ్డి విస్తరించి ఉంటుంది. సముద్ర పక్షులు ఇక్కడికి ఎక్కువగా వస్తుంటాయి. ఈ ద్వీపం అన్ని రకాల వన్యప్రాణులకు నిలయంగా ఉంది. బ్రిటన్ లోని అరుదైన జాతుల జంతువులు, వృక్షాలు కూడా ఇక్కడ పెరుగుతున్నాయి.
ఈ ద్వీపంపై చాలా మంది ఆసక్తి చూపించే అవకాశం ఉందని ఎడ్గార్ చెప్పారు. ‘‘స్కాట్లాండ్లో అనేక ప్రైవేట్ ఐల్యాండ్స్ ను మేం విక్రయించాం. ఇక్కడ ప్రైవేట్ దీవులకు దేశీయంగా, అంతర్జాతీయంగా మంచి డిమాండ్ ఉంది’’ అని చెప్పుకొచ్చారు. ఈ ద్వీపం విలువ 1.9 లక్షల డాలర్లట. మన రూపాయాల్లోనైతే 1.5 కోట్లు. కొంటారా మరి!!