Karthanandam: మా అమ్మ మా కోసం రెక్కలు ముక్కలు చేసుకుంది: కన్నీళ్లు పెట్టుకున్న కమెడియన్ కర్తానందం
- తాను పుట్టి పెరిగింది తెలంగాణలోనేనన్న కర్తానందం
- 'జబర్దస్త్' మంచి పేరు తెచ్చిపెట్టిందని వెల్లడి
- వేణు టీమ్ లో 200 ఎపిసోడ్స్ చేశానని వివరణ
- 'బలగం' సినిమాలో ఛాన్స్ కూడా వేణునే ఇచ్చాడని వెల్లడి
కమెడియన్ కర్తానందం .. 'జబర్దస్త్' స్టేజ్ పై సందడి చేసిన నటుడు. ఆయన పేరు కర్తానందం అనే విషయం చాలామందికి తెలియదుగానీ, ఆయనను చూడగానే గుర్తుపట్టేస్తారు. పొట్టిగా .. పెద్దకళ్లతో కనిపిస్తూ, తనదైన బాడీ లాంగ్వేజ్ తో .. తెలంగాణ యాసతో నవ్వించడం ఆయన ప్రత్యేకత. అలాంటి ఆయన ఇటీవల విడుదలైన 'దసరా' .. 'బలగం' రెండు సినిమాల్లోనూ కనిపించారు.
తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ .. "నేను పుట్టింది .. పెరిగింది .. ఉద్యోగం చేసింది తెలంగాణ ప్రాంతంలోనే. అందువల్లనే నాకు తెలంగాణ భాషపై మంచి పట్టు ఉంది. మేము నలుగురం అన్నదమ్ములం .. ఒక చెల్లి. మా చిన్నప్పుడే మా నాయన చనిపోయాడు. మమ్మల్ని పెంచడానికి మా అమ్మ రెక్కలు ముక్కలు చేసుకుంది. ఆమె పడిన కష్టాలను తలచుకుంటే ఏడుపొస్తుంది. అమ్మ గుర్తొస్తే కన్నీళ్లు రానిదెవరికి? అంటూ ఉద్వేగానికి లోనయ్యారు.
ఎన్ని కష్టాలు ఉన్నప్పటికీ మా అమ్మ మమ్మల్ని చదివించింది. నేనూ నా పిల్లల విషయంలో అదే పనిచేశాను. 'జబర్దస్త్'లో చేసే తాగుబోతు రాజమౌళి ద్వారా నాకు వేణు పరిచయమయ్యాడు. వేణు టీమ్ లో 200 ఎపిసోడ్స్ లో నటించాను. ఆ కామెడీ షో నాకు మంచి గుర్తింపును తీసుకొచ్చింది. నన్ను బుల్లితెరకి పరిచయం చేసింది వేణు .. 'బలగం'తో నాకు మంచి గుర్తింపు తీసుకొచ్చింది వేణు. ఆయన రుణం నేను తీర్చుకోలేను" అంటూ చెప్పుకొచ్చారు.