PSLV C-55: పీఎస్ఎల్వీ సి-55 ప్రయోగం విజయవంతం... ఇస్రోకు కమర్షియల్ సక్సెస్
- ఇస్రో ఖాతాలో మరో విజయం
- రెండు సింగపూర్ ఉపగ్రహాలను మోసుకెళ్లిన పీఎస్ఎల్వీ సి-55
- నిర్దేశిత కక్ష్యల్లోకి ఉపగ్రహాలను చేర్చిన వైనం
- ప్రయోగం సజావుగా పూర్తయిందన్న ఇస్రో
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ఖాతాలో మరో విజయం చేరింది. వాణిజ్య ప్రయోజనాలతో కూడిన ఈ రాకెట్ ప్రయోగం ఏపీలోని శ్రీహరికోట రాకెట్ ప్రయోగ కేంద్రం నుంచి చేపట్టారు. ఈ మధ్యాహ్నం 2.19 గంటలకు నింగిలోకి దూసుకెళ్లిన పీఎస్ఎల్వీ సి-55 రాకెట్... నిర్దేశిత కక్ష్యల్లోకి రెండు సింగపూర్ ఉపగ్రహాలను ప్రవేశపెట్టింది.
ఈ ప్రయోగం విజయవంతమైందని ఇస్రో తాజాగా ప్రకటించింది. టెలియోస్-2, ల్యూమ్ లైట్-4 ఉపగ్రహాలను 586 కిలోమీటర్ల వృత్తాకార కక్ష్యలోకి ఎలాంటి పొరపాటు లేకుండా ప్రవేశపెట్టడంతో, ప్రయోగం సజావుగా ముగిసిందని ఇస్రో వెల్లడించింది.
కాగా, ల్యూమ్ లైట్-4 నానో శాటిలైట్ ను సింగపూర్ నేషనల్ యూనివర్సిటీ పరిశోధకులు అభివృద్ధి చేశారు. ఇది సింగపూర్ సముద్ర నేవిగేషన్ కు ఉపయోగపడనుంది. టెలియోస్-2 శాటిలైట్ ను ప్రధానంగా భూ పరిశీలన నిమిత్తం అభివృద్ధి చేశారు.
ఇటీవల కాలంలో ఇస్రో విదేశీ ఉపగ్రహాలను రోదసిలోకి తీసుకెళుతూ వాణిజ్యపరంగా రాబడి అందుకుంటోంది. అందుకోసం నమ్మకమైన పీఎస్ఎల్వీ, జీఎస్ఎల్వీ రాకెట్లను వినియోగిస్తోంది. 100కి పైగా ఉపగ్రహాలను సైతం ఏకకాలంలో నింగిలోకి తీసుకెళ్లగల సత్తా ఇస్రో సొంతం. గతంలో ఈ విషయం రుజువైంది.