Vijayashanti: తమ్ముళ్లు రేవంత్ రెడ్డి, ఈటల రాజేందర్ అంటూ.. విజయశాంతి సూచనలు
- మునుగోడు ఎన్నికలప్పుడు కాంగ్రెస్ కు కేసీఆర్ రూ. 25 కోట్లు ఇచ్చారన్న ఈటల
- భాగ్యలక్ష్మి ఆలయం వద్ద ప్రమాణం చేసేందుకు సిద్ధమని రేవంత్ సవాల్
- ఇద్దరూ ప్రభుత్వంపై పోరాడాలని విజయశాంతి సూచన
మునుగోడు ఉప ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీకి ముఖ్యమంత్రి కేసీఆర్ రూ. 25 కోట్లు ఇచ్చారంటూ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ చేసిన ఆరోపణలు తెలంగాణలో రాజకీయ ప్రకంపనలు పుట్టిస్తున్నాయి. ఈటల చేసిన ఆరోపణలు అబద్ధమని... చార్మినార్ వద్ద ఉన్న భాగ్యలక్ష్మి ఆలయం వద్ద తడి బట్టలతో ప్రమాణం చేయడానికి కూడా తాను సిద్ధమేనని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. ప్రమాణం చేయడానికి ఈటల సిద్ధమా అని అన్నారు.
ఈ నేపథ్యంలో బీజేపీ నాయకురాలు విజయశాంతి స్పందిస్తూ రేవంత్, ఈటలకు సూచనలు చేశారు. 'దేశంలోనే అత్యంత ధన ప్రభావిత ఎన్నికల కార్యాచరణ తెలంగాణలో కొనసాగుతోంది. మన తెలంగాణ రాజకీయ కార్యకర్తలందరూ గత తొమ్మిది సంవత్సరాలుగా చూస్తున్న వాస్తవమిది. తమ్ముళ్లు రేవంత్ రెడ్డి గారు, ఈటల రాజేందర్ గారు ఇద్దరూ బీఆర్ఎస్ పై పోరాడే వాళ్లే. ఇద్దరూ ఒకరిపై మరొకరు కాకుండా... ఎవరి ధోరణిలో వారు ప్రభుత్వంపై పోరాడటం అవసరం. ఈ విషయాన్ని తెలంగాణ పరిస్థితులపై సంపూర్ణ అవగాహన ఉన్న ఇద్దరూ ఆలోచించాలని నిరంతర తెలంగాణ ఉద్యమకారిణిగా ప్రజల తరపున అభిప్రాయం చెప్పడం నా బాధ్యత అనిపించింది' అని ఆమె చెప్పారు.