Air India: కాక్ పిట్ లోకి గర్ల్ ఫ్రెండ్ ను ఆహ్వానించిన పైలట్.. విచారణ షురూ
- ఎయిర్ ఇండియా దుబాయి-ఢిల్లీ విమానంలో చోటు చేసుకున్న ఘటన
- కాక్ పిట్ లోని తన స్నేహితురాలి కోసం ఆల్కహాల్, స్నాక్స్ ఆర్డర్
- తెచ్చివ్వడానికి అభ్యంతరం వ్యక్తం చేసిన సిబ్బంది
ఎయిర్ ఇండియా విమానం పైలట్ ఒకరు నిబంధనలకు విరుద్ధంగా తన గర్ల్ ఫ్రెండ్ ని కాక్ పిట్ లోకి ఆహ్వానించాడు. దీనిపై ఫిర్యాదు అందడంతో విచారణ ప్రారంభమైంది. విచారణకు గాను ఎయిర్ ఇండియా ఓ కమిటీని నియమించింది. క్యాబిన్ క్రూ సిబ్బందే దీనిపై ఎయిర్ ఇండియాకి ఫిర్యాదు చేయడం కొసమెరుపు.
దుబాయి నుంచి ఢిల్లీకి వెళ్తున్న విమానంలో ఫిబ్రవరి 27న ఇది చోటు చేసుకోగా, క్యాబిన్ క్రూ సిబ్బంది నుంచి ఎయిర్ ఇండియాకి ఏప్రిల్ 3న ఫిర్యాదు అందింది. ఈ విషయం ఆలస్యంగా బయటకు వచ్చింది. ఎయిర్ ఇండియా 915 విమాన పైలట్ తొలుత ఆలస్యంగా విధులకు వచ్చాడు. మార్గమధ్యంలో బిజినెస్ క్లాస్ లో ఖాళీ ఉంటే చెప్పాలని క్యాబిన్ సిబ్బందిని కోరాడు. ఎకానమీలో ప్రయాణిస్తున్న తన స్నేహితురాలికి సౌకర్యంగా లేదని, ఆమె బిజినెస్ క్లాస్ కు మారిపోవాలని అనుకుంటున్నట్టు, ఖాళీ ఉంటే చెప్పాలని చెప్పాడు. ఖాళీ లేదని క్యాబిన్ సిబ్బంది బదులిచ్చారు.
అనంతరం తన గర్ల్ ఫ్రెండ్ ను కాక్ పిట్ లోకి తీసుకురావాలని సిబ్బందిని కోరాడు. పిల్లోలు తెచ్చివ్వాలని ఆదేశించాడు. మొదటి అబ్జర్వర్ సీట్లో ఆమెను కూర్చోబెట్టాడు. ఆమె కోసం ఆల్కహాల్, స్నాక్స్ కూడా ఆర్డర్ చేశాడు. కానీ, వాటిని కాక్ పిట్ లోకి తీసుకువచ్చేందుకు సిబ్బంది నిరాకరించారు. దాంతో అతడు సిబ్బందితో దురుసుగా ప్రవర్తించడం మొదలు పెట్టాడు. బ్రీత్ అనలైజర్ టెస్ట్ లు పూర్తి చేసుకున్న వారినే కాక్ పిట్ లోకి అనుమతించాల్సి ఉంటుందని, ఈ ఘటనలో సాంకేతిక, భద్రతా అంశాలను తాము పరిశీలిస్తున్నట్టు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ప్రకటించింది.