Assam: ఎమర్జెన్సీ కాలంలో జైలుకు వెళ్లిన వారికి అసోంలో పింఛన్

Assam Government to give 15000 rupees month to 301 people jailed during Emergency

  • నెలనెలా రూ.15 వేలు అందజేయనున్నట్లు ప్రకటించిన మంత్రి
  • ఇప్పటికే పింఛన్ అందజేస్తున్న పలు రాష్ట్ర ప్రభుత్వాలు
  • తమ రాష్ట్రంలోనే పింఛన్ ఎక్కువన్న మంత్రి అశోక్

మాజీ ప్రధాని ఇందిరాగాంధీ హయాంలో దేశంలో ఎమర్జెన్సీ విధించిన విషయం తెలిసిందే. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళన చేసిన వాళ్లను ఇందిర ప్రభుత్వం జైలుకు పంపింది. దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం అప్పుడు జైలుకెళ్లిన వారిని ఇప్పుడు సత్కరించాలని అసోం ప్రభుత్వం నిర్ణయించింది. వారికి నెల నెలా రూ.15 వేలు పింఛన్ అందించనున్నట్లు తెలిపింది. ఎమర్జెన్సీ కాలంలో జైలుకు వెళ్లిన అసోం పౌరులకు మాత్రమే ఈ పింఛన్ అందజేయనున్నట్లు వివరించింది.

1975లో విధించిన ఎమర్జెన్సీని వ్యతిరేకించి అసోంలో 301 మంది జైలుపాలయ్యారని ప్రభుత్వం గుర్తించింది. వీరికి నెలనెలా పింఛను అందజేయనున్నట్లు తెలిపింది. ఇందులో ఎవరైనా ప్రాణాలతో లేకుంటే వారి జీవిత భాగస్వామికి, ఒకవేళ ఇద్దరూ లేకుంటే వారి కూమార్తె (అవివాహిత) కు ఈ మొత్తం అందజేస్తామని మంత్రి అశోక్ సింగల్ చెప్పారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం వారు చేసిన కృషిని గుర్తించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి తెలిపారు. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో ఎమర్జెన్సీ కాలంలో జైలుపాలైన వారికి పింఛను అందజేస్తున్నారని వివరించారు. అయితే, మిగతా రాష్ట్రాలతో పోలిస్తే అసోం సర్కారు అత్యధికంగా పింఛను అందజేస్తుందని వెల్లడించారు.

  • Loading...

More Telugu News