Arjun Tendulkar: అర్జున్ టెండుల్కర్ బౌలింగ్ పై రషీద్ లతీఫ్ కీలక వ్యాఖ్యలు
- అర్జున్ బౌలింగ్ లో పేస్ సరిగ్గా లేదన్న రషీద్ లతీఫ్
- అతడికి మంచి శిక్షణ అవసరమన్న అభిప్రాయం
- అలైన్ మెంట్ మార్చుకోవాల్సిన అవసరం గురించి ప్రస్తావన
పాకిస్థాన్ మాజీ క్రికెటర్ అయిన రషీద్ లతీఫ్, దిగ్గజ భారత క్రికెటర్ సచిన్ తనయుడు అర్జున్ టెండుల్కర్ బౌలింగ్ శైలిపై కీలక వ్యాఖ్యలు చేశాడు. అర్జున్ తన బౌలింగ్ యాక్షన్ మార్చుకోవాల్సిన అవసరం ఉందన్నాడు. బౌలింగ్ అలైన్ మెంట్ సరిగ్గా లేదన్నాడు. 23 ఏళ్ల అర్జున్ టెండుల్కర్ ముంబై ఇండియన్స్ తరఫున ఈ సీజన్ లో ఇప్పటికి రెండు మ్యాచ్ లు ఆడడం తెలిసిందే. రెండో మ్యాచ్ లో అతడు తన తొలి ఐపీఎల్ వికెట్ కూడా తీశాడు. దీంతో ఎంతో మంది నుంచి ప్రశంసలు వెల్లువెత్తాయి. లతీఫ్ సహా కొద్ది మంది అర్జున్ ఎంతో మెరుగవ్వాలంటూ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
‘‘అర్జున్ కెరీర్ ఆరంభంలోనే ఉన్నాడు. అతడు ఎంతో కష్టపడాల్సి ఉంది. అతడి అలైన్ మెంట్ మంచిగా లేదు. అలా అయితే అతడు వేగాన్ని అందుకోలేడు. ఓ మంచి బయోమెకానికల్ కన్సల్టెంట్ గైడ్ చేస్తే.. అప్పుడు అర్జున్ బౌలింగ్ లో వేగం పెరగొచ్చు. సచిన్ ఆ పని చేయగలడు. కానీ, అందుకోసం దేశవాళీ క్రికెట్ పై ఆధారపడ్డాడు. బ్యాలన్స్ సరిగ్గా లేకపోవడం అర్జున్ పేస్ ను ప్రభావితం చేస్తోంది. కెరీర్ ఆరంభంలోనే ఉన్నాడు కనుక అతడి పేస్ 135 కిలోమీటర్ల వేగాన్ని చేరుకోగలదు. అతడు మంచి బ్యాటర్ కూడా. 2-3 ఏళ్లలో మంచి ప్లేయర్ అవుతాడు’’ అని లతీఫ్ తన యూట్యూబ్ చానల్ లో పేర్కొన్నాడు.
అర్జున్ టెండుల్కర్ ముంబై ఇండియన్స్ కు కాకుండా మరో ఫ్రాంచైజీ తరఫున ఆడితే మరో రకంగా ఉంటుందని లతీఫ్ అన్నాడు. ‘‘వేరొక ఫ్రాంచైజీ ఉదాహరణకు సన్ రైజర్స్ హైదరాబాద్ తరఫున ఆడితే అతడి వ్యక్తిత్వం పూర్తి భిన్నంగా ఉంటుంది. ఇప్పుడు అయితే అతడి తండ్రి కూడా డ్రెస్సింగ్ రూమ్ లోనే ఉంటున్నాడు. అర్జున్ నాన్ క్రికెట్ లైఫ్ లోకీ తండ్రి పాత్ర వచ్చి చేరింది’’ అని లతీఫ్ వ్యాఖ్యానించాడు.