sudan: ఇది మనుషుల ప్రాణాలతో ముడిపడిన అంశం, రాజకీయాలు వద్దు: విదేశాంగ మంత్రి జైశంకర్ ఆగ్రహం
- కర్ణాటక వాసులు సుడాన్‌లో చిక్కుకుపోయారన్న కాంగ్రెస్ నేత సిద్ధరామయ్య
- వారిని రక్షించేందుకు కేంద్రం తక్షణం రంగంలోకి దిగాలంటూ ట్వీట్
- సిద్ధరామయ్య ట్వీట్‌పై విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్ ఆగ్రహం
- అంతర్యుద్ధం మొదలైన నాటి నుంచి కేంద్రం అక్కడి భారతీయులతో టచ్‌లో ఉందని వెల్లడి
అంతర్యుద్ధంతో అట్టుడుకుతున్న సుడాన్‌లో చిక్కుకుపోయిన కర్ణాటక వాసులను కాపాడేందుకు కేంద్రం తక్షణం రంగంలోకి దిగాలన్న కాంగ్రెస్ నేత సిద్ధరామయ్య వ్యాఖ్యలపై విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్ జైశంకర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మనుషుల ప్రాణాలకు సంబంధించిన విషయాల్లో రాజకీయాలు వద్దంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
‘‘మీ ట్వీట్ చూసి షాకైపోయా. ఇది మనుషుల ప్రాణాలతో ముడిపడిన అంశం. సుడాన్‌లో మిలిటరీ దళాల మధ్య ఏప్రిల్ 14న ఘర్షణలు మొదలైన నాటి నుంచీ విదేశాంగ శాఖ అక్కడి భారతీయులు, భారత సంతతి వారితో టచ్‌లోనే ఉంది’’ అని మంత్రి జైశంకర్ ట్వీట్ చేశారు.
సుడాన్‌లో కర్ణాటక వాసులు చిక్కుకుపోయిన విషయాన్ని ప్రస్తావిస్తూ సిద్ధరామయ్య అంతకుమునుపు ఓ ట్వీట్ చేశారు. హక్కీపిక్కీ తెగకు చెందిన 31 మంది సుడాన్‌లో ఉన్నారన్న ఆయన, వారిని సురక్షితంగా స్వదేశానికి రప్పించేందుకు భారత ప్రభుత్వం తక్షణం కలుగజేసుకోవాలని ట్వీట్ చేశారు.